అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను మంగళవారం రాత్రి సీబీఐ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి బెంగళూరుకి తరలించారు. ఆమె మేనేజింగ్ డైరెక్టరుగా స్థాపించిన విశ్వేశ్వర ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరున హైదరాబాద్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 2015లో రూ. 42.79 కోట్లు అప్పు తీసుకొని దానిని వేరే ఖాతాలకు మళ్లించి వాడుకొన్నారు. ఆ బాకీని తీర్చకపోవడంతో వడ్డీ, జరిమానాలు కలిపి మొత్తం రూ.81.21 కోట్లు చెల్లించాలని బ్యాంక్ నోటీసులు పంపించింది. కానీ ఆమె చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు.
2015, జూన్ 30వ తేదీన సీబీఐ ఆమెపై , భర్త రామకోటేశ్వర రావుపై చార్జ్ షీట్ నమోదు చేసింది. కొత్తపల్లి గీత2014 లోక్‌బహిరంగసభలో ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధిగా అరకు నుంచి పోటీ చేసి గెలిచారు. యధారాజా తధా ప్రజా అనుకొన్నారో ఏమో ఆమె కూడా బ్యాంకుకి కుచ్చుటోపీ పెట్టేందుకు ఓ బోగస్ సంస్థను సృష్టించి రూ.42.79 కోట్లు బయటకు తీయగలిగారు.
ఎంపీగా ఉన్నాననే ధీమాతో బ్యాంకుకి ఎగవేసినప్పటికీ, ఆ కేసు మెడకు చుట్టుకొంటుందని తెలియగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి (2019)లో చేరిపోయారు. బిజెపిలో చేరినా సీబీఐ అధికారులు విడిచిపెట్టలేదు. ఆ కేసులోనే సీబీఐ అధికారులు కొత్తపల్లి గీతను, ఆమె భర్త రామకోటేశ్వర రావును సుదీర్గంగా విచారణ జరిపిన తర్వాత నిన్న రాత్రి అరెస్ట్ చేసారు. ఈరోజు ఉస్మానియా హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టారు.
ఈ కేసుపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు కొత్తపల్లి గీత, ఆమె భర్త రామకోటేశ్వర రావుకి చెరో ఐదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. వీరికి సహకరించినందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు బీకే జయప్రకాశన్, కెకె అరవిందాక్షన్‌కు కూడా చెరోఐదేళ్ళ జైలు శిక్ష విదించింది. బ్యాంకును మోసం చేసినందుకు విశ్వేశ్వర ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రెండు లక్షలు జరిమానా విధించింది. సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించగానే కొత్తపల్లి గీత, ఆమె భర్త తరపు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్స్ దాఖలు చేశారు.



