విలాసవంతమైన కార్లు ప్రముఖుల పిల్లలను బలి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత దశాబ్ద కాలంలో ఎందరో ప్రముఖుల పిల్లలు ఇలా మృత్యువాత పడ్డారు. సమాజంలో ఓ స్థాయి ఉండడంతో అడిగింది కాదనకుండా ఇస్తున్న తల్లిదండ్రులకు చివరికి కడుపుకోత మిగులుస్తున్నారు సుపుత్రులు. తాజాగా ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మరోమారు ప్రముఖుల కుమారులపై చర్చ మొదలైంది.
అక్టోబరు 13, 2003లో సినీ నటుడు బాబుమోహన్ కుమారుడు 26 ఏళ్ళ పవన్ కుమార్ బైక్‌పై వస్తూ తెల్లవారుజామున 5 గంటల సమయంలో జూబ్లీహిల్స్ సమీపంలో డివైడర్ ను ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. జూన్ 1, 2010లో మరో ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు 39 ఏళ్ళ కోట ప్రసాద్ 1000 సీసీ బైక్‌పై వెళ్తూ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో వాహనాన్ని ఢీకొని మృతి చెందాడు. ఇలా సినీ ప్రముఖులే కాదు, క్రీడా, రాజకీయ దిగ్గజాలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
సెప్టెంబరు 16, 2011లో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు 19 ఏళ్ళ అయాజుద్దీన్ ఔటర్ రింగ్ రోడ్డుపై తన 1000 సీసీ బైక్‌తో ప్రయాణిస్తూ అదుపుతప్పి కిందపడ్డాడు. ఆస్పత్రిలో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి మృతి చెందాడు. అదే ఏడాది డిసెంబరు 20న మాజీ మంత్రి కోమటిరెడ్డి తనయుడు 19 ఏళ్ళ ప్రతీక్ రెడ్డి నార్సింగ్ -పటాన్ చెరు మధ్య కొల్లూరు సమీపంలో కారు ప్రమాదంలో మృతి చెందాడు. వీరంతా తమ తప్పిదాలతో ప్రమాదాన్ని కొనితెచ్చుకోగా, మరికొంతమంది ప్రముఖులు అనుకోని ప్రమాదంలో విగతజీవులుగా మారారు.
2014లో నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ కుమారుడు జానకింరాం మృతి చెందాడు. అలాగే ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన పి.ఇంద్రారెడ్డి 1999లో ఓ పెళ్లికి హాజరై వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 2011లో అప్పటి మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేటకు చెందిన బీజేపీ నాయకురాలు వనం ఝాన్సీ హైదరాబాద్ కు వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 2012లో శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు, 2013లో హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తూ రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎంపీ లాల్‌జాన్ భాష, 2014లో వైసీపీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో మృతి చెందారు.



