పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రకారం ప్రతీరోజు పెరుగుతుండగా, గ్యాస్ సిలెండర్ ధరలు నెలకొకసారి పెరుగుతున్నాయి. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు కూడా ప్రతీ నెలా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ నిబంధనల చట్టం-2005కి సవరణలు చేస్తోంది. శుక్రవారం ఈమేరకు సవరణల ముసాయిదా ప్రతులను అన్ని రాష్ట్రాలకు పంపించింది కూడా. సెప్టెంబర్ 11వ తేదీలోగా అభ్యంతరాలు, సలహాలను పంపించాలని కేంద్రం కోరింది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, విద్యుత్ చార్జీల భారం సామాన్య ప్రజలు భరించలేని స్థాయికి చేరుకొన్నాయి. మరోపక్క ఇదివరకే చెల్లించిన పాత బిల్లులలో బకాయిలున్నాయంటూ విద్యుత్ సంస్థలు ట్రూఅప్ పేరుతో మళ్ళీ ముక్కు పిండి అదనంగా వసూలు చేస్తున్నాయి.
ఏమంటే, గత త్రైమాసికంలో వినియోగదారుల నుంచి బిల్లుల రూపంలో వసూలు అయిన సొమ్ము కంటే, విద్యుత్ కొనుగోలుకి అయిన ఖర్చే ఎక్కువగా ఉంటోంది. కనుక ఆ నష్టాన్ని వినియోగదారులే భరించాలి అంటూ ట్రూఅప్ పేరుతో పిండేస్తున్నాయి.
ఇవన్నీ సరిపోవన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రజలపై నెలనెలా పెరిగే ఈ అదనపు భారాన్ని మోపబోతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ నిబంధనలు సవరణల బిల్లు-2022ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కానీ ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు, అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపించింది.
ఇప్పటికే అన్ని రాష్ట్రాలు అప్పులలో మునిగిపోతున్నాయి. కనుక ఈ విద్యుత్ భారాన్ని మోసేందుకు సిద్దపడవు. నెలనెలా విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనకు ఆమోదం తెలుపడం ఖాయం. దేశంలో అన్ని రాష్ట్రాలు అంగీకరిస్తే స్టాండింగ్ కమిటీ తూతూ మంత్రంగా చిన్న చిన్న సవరణలతో దానినే పార్లమెంటుకు సిఫార్సు చేయడం ఖాయం.
అప్పుడు ఈ విద్యుత్ నిబంధనలు సవరణల బిల్లు-2022కి పార్లమెంటు కూడా ఆమోదముద్ర వేయడం ఖాయం. కనుక ఈ ఏడాది దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం దేశప్రజలను ఈ సరికొత్త బాదుడుతో బాదబోతోంది. ప్రజలందరూ ఒక పూట పస్తుండైనా సరే ఈ అదనపు భారం మొసేందుకు సిద్దంగా ఉండక తప్పదు.



