ఓ పక్కన రాష్ట్రంలో ప్రతిపక్షాలు ‘ప్రత్యేక హోదా’పై రాజకీయం చేస్తూ లబ్ది పొందాలని భావిస్తుంటే, హోదా స్థానంలో ఒప్పుకున్న ప్యాకేజ్ కు చట్టబద్ధత కల్పించి, విపక్షాలకు చెక్ పెట్టాలని అధికార పక్షం భావిస్తోంది. కానీ, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మాత్రం చట్టబద్ధత కల్పించే విషయంలో వెనుకడుగులు వేస్తుండడం చంద్రబాబు సర్కార్ కు ఆవేదన కలిగించే అంశంగా మారింది. తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఏపీ ప్యాకేజ్ పై చట్టబద్ధత వస్తుందని భావించిన టిడిపికి నిరాశే ఎదురైంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంశం టేబుల్ ఐటమ్ గా ఉన్నప్పటికీ, దీనిపై ఎలాంటి చర్చా జరగలేదు. ప్రస్తుతం చర్చించేందుకు తగిన సమయం లేదని, తదుపరి సమావేశంలో ఈ అంశంపై చర్చిద్దామని మోడీ ఒక్క మాటలో తేల్చేసారు. దీంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశామని, తదుపరి సమావేశంలో దీనిపై చర్చిస్తామని కేంద్ర మంత్రులు తెలిపారు. అయితే సమయాభావం అన్నది నిజమేనా? లేక తప్పించుకోవడానికి మరో మార్గమా? అన్నది తెలియాల్సి ఉంది.
దీంతో చంద్రబాబు పరిస్థితి ‘కక్కలేక… మింగలేక…’ అన్నట్లుగా తయారయ్యింది. కేంద్ర సర్కార్ పై దండెత్తుదామంటే, వచ్చే అరకొర నిధులు కూడా రావేమోనన్న భయం ఓ పక్కనైతే, మోడీ సర్కార్ కు జై కొడదామంటే రాజకీయంగా ప్రతికూల అంశాలు తలెత్తే అవకాశం ఉన్నందున పాలుపోని పరిస్థితిలోకి చంద్రబాబు వెళ్ళిపోతున్నారు. దీంతో నేడు కాకపోయినా, రేపైనా చట్టబద్ధత వస్తుందన్న ధీమాను ప్రదర్శించడం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేని పరిస్థితిలో రాష్ట్ర సర్కార్ ఉంది.



