నిజం గెలిచి మూడేళ్ళు… లోకేష్ ట్వీట్‌

Chandrababu Naidu, Nara Lokesh and Pawan Kalyan during the Nijam Gelichindi movement after Chandrababu’s arrest

సరిగ్గా మూడేళ్ళ క్రితం ఇదే రోజున జగన్‌ ప్రభుత్వం టీడీపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ‘స్కిల్ డెవలప్‌మెంట్‌’ అంటే అదేదో బూతుపదం అన్నట్లు ప్రచారం చేసి, ఆ కేసులో జైలులో పెట్టారు.

ఒకవేళ చంద్రబాబు నాయుడు నిజంగానే అవినీతికి పాల్పడి ఉంటే, జగన్‌ విదేశంలో ఉండగా, గవర్నర్‌ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేసి ఉండేవారు కారు.

ADVERTISEMENT

ఆయనని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆయన మనోబలాన్ని, ఆరోగ్యాన్ని దెబ్బ తీయగలిగితే, అప్పటికే కేసులు, వేధింపులతో సతమతమవుతున్న టీడీపి శ్రేణులు కూడా మనోబలం కోల్పోయి చెల్లాచెదురు అయిపోతారని జగన్‌ భావించి ఉంటారు. అప్పుడు ఇక ఎన్నికలలో వైసీపీకి ఎదురే ఉండదనుకున్నారు.

కానీ ఆ నిర్ణయమే వైసీపీ కొంప ముంచింది. వైసీపీకి అదే ఓ పెను శాపంగా, రాజకీయ ఆత్మహత్యగా మారింది.

ప్రజలలో ఆయన పట్ల ఊహించని స్థాయిలో సానుభూతి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు సైతం చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం జీర్ణించుకోలేకపోయారు. అయన వలన ఐటి రంగంలోకి దేశవిదేశాలలో స్థిరపడిన అనేక మంది ఐటి ఉద్యోగులు జగన్‌ చర్యలను ఖండించారు. చంద్రబాబు నాయుడు… అయన కుటుంబానికి సంఘీభావం తెలిపారు.

ఇక అయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మిణి, యువ నాయకుడు నారా లోకేష్‌ సైతం ప్రజల మధ్యకు వచ్చి ‘నిజం గెలవాలంటూ’ పోరాటాలు చేశారు.

కానీ పోరాటాలంటే ప్రభుత్వ ఆస్తులు విధ్వంసం, బంద్‌లు అనుకునే ఈ రోజుల్లో అటువంటివేమీ జరగకుండానే, పెద్ద ఎత్తున ఓ ఉద్యమంలా సాగాయి.

రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి టీడీపి నేతలు చేస్తున్న ఈ పోరాటాల సెగలు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు వ్యాపించాయి.

ఓ పక్క నారా లోకేష్‌ చేసిన న్యాయపోరాటాలు చేస్తుంటే, నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ప్రజల మధ్యకు వచ్చి ‘నిజం గెలవాలి’ అంటూ చేసిన పోరాటాలతో రాష్ట్రంలో మహిళలను కదిలించగలిగారు.

చివరికి అందరూ కోరుకున్నట్లు నిజం గెలిచింది. ఆ నిజాన్ని ఉక్కుపాదంతో అణచి వేద్దామనుకున్న జగన్‌ వల్లనే వైసీపీ అధోగతి పాలైంది.

జగన్‌ ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలచినట్లు, పవన్ కళ్యాణ్‌ రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడుని కలిసి సంఘీభావం ప్రకటించి, అప్పుడే టీడీపితో జనసేన పొత్తుని ప్రకటించారు. దీంతో చంద్రబాబు నాయుడు విడుదలకు ముందే జగన్‌కు తన భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోందో స్పష్టంగా అర్ధమైంది.

ఆనాడు జరిగిన ఈ పరిణామాలు టీడీపికి, చంద్రబాబు నాయుడుకి, అయన కుటుంబానికి కూడా చాలా చేదు అనుభవమే కావచ్చు. కానీ అలాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా అందరూ కలిసికట్టుగా ధైర్యంగా నిలబడి, నిజం గెలవాలి అంటూ చేసిన ఆ పోరాటాలతో టీడీపి తనను తాను మరోసారి అవిష్కరించుకుంది కూడా. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను సైతం టీడీపి తట్టుకొని నిలబడగలదని మరోసారి నిరూపించి చూపింది.

ఆ నిజం గెలిచి నేటికి మూడేళ్ళు. కనుక ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ దానిని గుర్తుచేసుకుంటూ ఈ ట్వీట్‌ చేశారు.

ADVERTISEMENT
Latest Stories