‘ఆపరేషన్ ఆకర్ష్’కు ఎందుకు మొదలైందో చెప్పిన చంద్రబాబు!

chandrababu naidiu about operation akarshఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’కు విపక్ష వైసీపీ విలవిల్లాడుతోంది. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ కే కాకుండా అధికార పార్టీ టీడీపీ నేతలకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అప్పటిదాకా రాజకీయ శత్రువులుగా ఉన్న వారితో కలిసి పనిచేయడమెలా? అన్న ఆందోళన కొందరు టీడీపీ నేతలను కలచి వేస్తోందన్నది వాస్తవం. ఈ క్రమంలో తొలుత కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చేరికపై ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జీ రామసుబ్బారెడ్డి నిరసన గళం విప్పారు. దీంతో రంగంలోకి దిగిన చంద్రబాబు, రామసుబ్బారెడ్డిని నేరుగా విజయవాడకు పిలిపించుకుని సర్దిచెప్పడంతో మెత్తబడ్డారు. ఆదినారాయణరెడ్డి చేరికకు లైన్ క్లియర్ అయినట్లయ్యింది.

ADVERTISEMENT

ప్రస్తుతం, ప్రకాశం జిల్లా, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా టీడీపీలో చేరబోతున్నారు. గొట్టిపాటి చేరికను టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం, ఆయన కుమారుడు, అద్దంకి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జీ కరణం వెంకటేశ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మునుపటి వ్యూహాన్నే అనుసరిస్తూ కరణంను విజయవాడకు పిలిపించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు గల కారణాలను చంద్రబాబు వివరించారు.

“ప్రభుత్వాన్నే కూల్చేస్తామంటూ విపక్షం బరి తెగిస్తే… చూస్తూ ఊరుకోవాలా? విపక్షం ఆ స్థాయికి వెళ్లినప్పుడు మనం చూస్తూ ఊరుకోలేం కదా? అందుకే ‘ఆకర్ష్’కు తెరలేపాం… సీనియర్లుగా పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సర్దుకుపోవాల్సిందే” అంటూ ‘ఆపరేషన్ ఆకర్ష్’ సిద్ధాంతాన్ని చంద్రబాబు బయటపెట్టడంతో కరణం మెత్తబడక తప్పలేదు. ఈ పరిణామంతో గొట్టిపాటి చేరికకు కూడా లైన్ క్లియర్ అయినట్లయ్యింది.

ADVERTISEMENT
Latest Stories