శాసనసభ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన టిడిపి కూటమి ఇంకా ఆ హడావుడిలోనే ఉండగానే, ఎన్నికలలో దారుణంగా ఓడిపోయిన వైసీపి మాత్రం చాలా త్వరగానే కోలుకొని అప్పుడే ఎదురు దాడులు కూడా చేస్తుండటం విశేషం.
ఈ రెండు పార్టీల రాజకీయాలు కొత్తగా ఇప్పుడు మొదలవలేదు. అలాగే ఇప్పట్లో ఆగేవి కూడా కావు. కనుక వాటి రాజకీయాలను పక్కన పెడితే, ప్రజలు టిడిపి ప్రభుత్వం నుంచి ఏమి ఆశిస్తున్నారో వాటిపై సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఎమ్మెల్యేలు దృష్టి పెట్టి పనులు మొదలు పెట్టాల్సి ఉంటుంది.
రాష్ట్ర ప్రజలు అమరావతి, పోలవరం పనులు మొదలుపెడితే చూడాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు…. అని చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు. అందుకే ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టగానే అమరావతి, పోలవరంలోనే పర్యటించి పరిస్థితిని సమీక్షించారు కూడా.
కానీ ఈ రెండూ చాలా భారీ ప్రాజెక్టులే. గత 5 ఏళ్ళలో జగన్ ప్రభుత్వం వీటిని ఎంతగా నష్టపరిచిందో, పనులు ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో, వాటికి ఎంత సొమ్ము కావాలో, ఆ సొమ్ముని ఎలా సమకూర్చుకోవాలో ముందుగా తెలుసుకోవలసి ఉంటుంది. కనుక వీటన్నిటికీ మరో రెండు మూడు నెలలు సమయం పట్టవచ్చు.
ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభం అయ్యింది. కనుక వ్యవసాయానికి సంబందించిన నిర్ణయాలు, రైతులకు ఇచ్చిన హామీల కోసం వారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్న చిన్న సాగునీటి ప్రాజెక్టులు మరమత్తులకు నోచుకోక నిరుపయోగంగా మారాయి. వాటన్నిటినీ సరిచేసి సాగునీరు అందించాలని రైతులు కోరుకుంటున్నారు.
జగన్ పాలనలో రాష్ట్రంలో గుంతలు పడిన రోడ్లకు మరమత్తులు చేయించాలని, కొత్త రోడ్లు వేయాలంటూ టిడిపి, జనసేనలు చాలా పోరాటాలు చేశాయి. ఇప్పుడు అవే అధికారంలో ఉన్నాయి. కనుక వీలైనంత త్వరగా ఈ సమస్యపై దృష్టి సారించి పనులు మొదలుపెట్టాలని ప్రజలు ఆశిస్తున్నారు.
జగన్ ప్రభుత్వం రోడ్లే మరమత్తులు చేయించలేకపోయినప్పుడు ఫ్లైఓవర్లు నిర్మించగలదని ఎవరూ ఆశపడలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినందున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలలో కొత్త రోడ్లు వేసి, అవసరమైన చోట ఫ్లైఓవర్లు నిర్మించాలని, మౌలిక వసతులు మెరుగుపరచాలని ప్రజలు ఆశిస్తున్నారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణకు లక్షల కోట్ల పెట్టుబడులు, వాటితో అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు తరలివచ్చేవి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు వస్తాయని ఆంధ్ర ప్రజలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా తాము అధికారంలోకి రాగానే పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పించి భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. కనుక వీలైనంత త్వరగా దీనిపై దృష్టి సారించి రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయనే శుభవార్త వినిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
జగన్ పాలనలో చిన్న, మద్యతరగతి పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. అవన్నీ ప్రభుత్వం సహాయ సహకారాల కోసం ఎదురుచూస్తున్నాయి. వాటి సమస్యలను పరిష్కరించగలిగితే అవి లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించగలవు.
జగన్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిన వాటిలో విద్యా, వైద్య, రవాణా, క్రీడా, రియల్ ఎస్టేట్ రంగాలు కూడా ఉన్నాయి. వాటిపై సంబందిత మంత్రులు దృష్టి పెట్టి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ప్రజలు, వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఎదురుచూస్తున్నారు.
ఐదేళ్ళ జగన్ విధ్వంసకర పాలనలో సంక్షేమ పధకాల గోల తప్పితే అభివృద్ధి అనే పదం వినిపించలేదు. కనుక ప్రజలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు, మంత్రుల నోట అభివృద్ధి పనుల గురించి వినాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ అభివృద్ధి ఎప్పుడు వినిపిస్తుందో, ఎలా మొదలవుతుందో చూడాలి!




