చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పొత్తులపై స్పష్టత?

Chandrababu-Naidu-Amit-Shah-TDP-BJPటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఆదివారం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్‌ బొమ్మతో ఆర్బీఐ ముద్రించిన రూ.100 నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేస్తారు. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఆ తర్వాత ఈసీని కలిసి ఏపీలో జగన్ ప్రభుత్వం ఓటర్ల జాబితాలో నుంచి వేలసంఖ్యలో ఓటర్లను తొలగిస్తుండటం, అలాగే వేల సంఖ్యలో దొంగ ఓటర్లను చేర్చుతుండటంపై సాక్ష్యాధారాలతో సహా సమర్పించి ఫిర్యాదు చేయనున్నారు. చంద్రబాబు నాయుడు రెండు రోజులు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ అమిత్‌ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ADVERTISEMENT

ఏపీలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, టిడిపి నేతలపై, టిడిపి కార్యాలయాలపై వైసీపీ నేతలు చేస్తున్న దాడుల గురించి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ వ్రాశారు. అమిత్‌ షా, జేపీ నడ్డాలు కూడా ఏపీలో పర్యటించినప్పుడు వారిద్దరూ కూడా జగన్‌ పాలనలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలు, అవినీతి గురించి మాట్లాడారు. ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా జగన్ ప్రభుత్వం అవినీతి గురించి మాట్లాడుతూనే ఉన్నారు. కనుక చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో అమిత్‌ షాని కలిస్తే తప్పకుండా ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి వివరించడం ఖాయమే.

తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ని పదవిలో నుంచి తప్పించుకొని బిజెపి తన విజయావకాశాలను స్వయంగా దెబ్బ తీసుకొందనే వాదనలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. కనుక తెలంగాణలో టిడిపి మద్దతు కోరవచ్చు.

తెలంగాణలో బిజెపికి సహకరించాలంటే, ఏపీలో టిడిపికి అది సహకరించాల్సి ఉంటుంది. కనుక ఒకవేళ చంద్రబాబు-అమిత్‌ షాలు భేటీ అయితే ఈ రెండు అంశాలపై చర్చించి ఏదో ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగించుకొని తిరిగివచ్చాక టిడిపి-బిజెపి పొత్తులపై స్పష్టత రావచ్చు.

ADVERTISEMENT
Latest Stories