చంద్రబాబు ప్రస్తావన లేకుండా వైసీపీ నాయకులకు పూట గడవని పరిస్థితి. విచిత్రం ఏమిటంటే.., టీడీపీ నేతల విమర్శలకే కాదు., పవన్ ప్రశ్నలకు., బీజేపీ పార్టీ దూషణలకు కూడా చంద్రబాబునే దోషిగా చూపించడం వైసీపీ నాయకులకు పరిపాటిగా మారిపోయింది. చిన్న పిల్లలు స్కూల్ లో చెప్పే “ఆవు పాఠం” మాదిరి వైసీపీ నాయకులు ప్రతిపక్షనేత కధను నడిపిస్తూ ఉంటారు.
విషయానికి వస్తే…, కౌలు రైతు ఆత్మహత్యలకు నిరసనగా పవన్ చేపట్టిన రైతు భరోసా యాత్రను విమర్శించడానికి మీడియా ముందుకొచ్చిన అంబటి యధావిధిగా ఈ చావులకు చంద్రబాబే కారణమంటూ దోషం మొత్తాన్ని టీడీపీ ప్రభుత్వం మీదకు నెట్టేశారు. ఒకవేళ వారన్నదే నిజమని భావించినా., దోషం టీడీపీ చేస్తే.., నివారణ వైసీపీ చెయ్యాలి కదా..! అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం కరువవుతుంది.
ఏ రైతు కుటుంబం అయినా ఒక్క పంటతోనో., ఒక్క పంటలో నష్టం వస్తేనో అప్పుల పాలయిపోరు. కాలానుగుణంగా అప్పుల ఊభిలో మునిగిపోతారు. ఇప్పుడు జరుగుతున్న రైతుల ఆత్మహత్యలన్నీ గత ప్రభుత్వం నాటి వైఫల్యాలే ఫలితాలే అంటూ అంబటి ఆ పార్టీ “ఆవు కధ” సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారు. అప్పులు కాలానుగుణంగా జరిగితే అభివృద్ధి మాత్రం కాలాలకు అతీతంగా జరుగుతుందా? అంటూ తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.
ఒక కుటుంబ ఆర్ధిక పరిస్థితి ఎదగాలన్నా.., ఒదగాలన్నా కాలానుగుణంగా జరగాల్సిందే అన్న విషయం తెలిసిన వైసీపీ నేతలకు ఒక ‘రాష్ట్ర రాజధాని’ నిర్మాణం ఒక ప్రభుత్వ హయాంలోనే పూర్తి కాదు అనే నిజం తెలుసుకోలేరా?., ఏపీకి జీవనాధారం వంటి ప్రతిష్ఠాత్మకమైన పోలవరం నిర్మాణం వైసీపీ అధికారంలోకి వచ్చాకే మొదలైందా? దీని ఫలితాలలో చంద్రబాబు హస్తం లేదా? అంటూ టీడీపీ నాయకులు అంబటికి అదిరిపోయే కౌంటర్లను సిద్ధం చేశారు.
విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్., బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్లు., ఎవరి హయాంలో నిర్మించారు..? ఎవరి హయాంలో రిబ్బన్ కటింగ్ జరిగింది? ఫ్లై ఓవర్లు గాలిలో ‘ఫ్యాన్’ మాదిరి ‘ఫ్లై’ అవుతూ జగన్ వద్దకు వచ్చి ఆగిందా? మరి అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకులేస్తుంది అంటూ తెలుదేశం సోషల్ మీడియా అంబటిపై సెటైర్లతో విరుచుకుపడుతుంది.
కరెంటు చార్జీలు ఎందుకు పెంచారు అన్నా., చెత్త పన్ను కారణమేంటి అన్నా., లిక్కర్ లో కొత్త బ్రాండ్స్ తయారీ ఎక్కడిదన్నా., పోలవరం ఆలస్యానికి కారణం చెప్పమన్నా., ప్రత్యేక హోదా సాధించలేదన్నా., చివరికి రాష్ట్రానికి ఈ అప్పుల భారం ఏంటన్నా.., అన్నింటికి జగన్ సర్కార్ దగ్గర ఉన్న ఒకే సమాధానం ‘చంద్రబాబు నాయుడు.’
రాజధాని నిర్మాణానికి రైతులే స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పులింగో ప్రభుత్వానికి అందించినప్పుడు., మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలను నెలకొలిపినప్పుడు., కియా మోటర్స్ ఏర్పాటు చేసినప్పుడు మాత్రం జగన్ ప్రభుత్వం వచ్చిందనో., లేక రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని ఉహించి చేసిన అభివృద్ధి కార్యక్రమాల ఇవన్నీ అంటూ టీడీపీ శ్రేణులు అంబటిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.
‘అభివృద్ధి’ అయినా ‘విధ్వంసమైనా’ కాలానుగుణంగా జరిగే ప్రక్రియలో భాగమే. అయితే అభివృద్ధి ఫలాలు అందుకోవాలంటే కొన్ని తరాలు వేచి చూడాలి., కానీ విధ్వంసం తాలూకా ఫలితాలు మాత్రం వెంటనే అనుభవించాల్సి వస్తుంది. ఆ ఫలితాలతో కొన్ని తరాలు తలెత్తి జీవించలేని దుస్థితికి సాక్షాలుగా మిగులుతాయని అధికారంలో ఉన్న పెద్దలు తెలుసుకునే రోజు కోసం భావితరం ఎదురు చూస్తుంది.



