నవంబర్ 30వ తేదీన తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఏపీలో జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడంతో 35 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుని నిరసిస్తూ హైదరాబాద్‌లో ఐటి ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేశారు.
నేడు మళ్ళీ హైదరాబాద్‌లో ఐటి ఉద్యోగులు, టిడిపి మద్దతుదారులు చంద్రబాబు నాయుడు అరెస్టుకి నిరసన తెలిపేందుకు నల్ల దుస్తులు ధరించి మియాపూర్ స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇకనైనా హైదరాబాద్ నగరంలో ఉన్న ఆంధ్రాకు చెందిన ఐటి, నాన్-ఐటి ఉద్యోగులందరూ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపి, ఆయన అరెస్టుని నిరసనలు తెలపాలని వారు కోరారు. కేసీఆర్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించకపోవడాన్ని వారు తప్పు పట్టారు. జగన్, కేసీఆర్ ప్రభుత్వాల వైఖరిని ధైర్యంగా ప్రశ్నించాలని వారు కోరారు.
తాము టికెట్లు కొనుక్కొని మెట్రో రైల్లో ప్రయాణిస్తూ శాంతియుతంగా నిరసనలు తెలపాలనుకొంటే తమను పోలీసులు అడ్డుకొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికలలో ఆంధ్రా ఓటర్లు బిఆర్ఎస్ పార్టీకి, ఏపీ శాసనసభ ఎన్నికలలో అక్కడి ఓట్లరు వైసీపికి గట్టిగా బుద్ధిచెప్పాలని వారు పిలుపునిచ్చారు.
చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రభావం ఏపీ శాసనసభ ఎన్నికలపై తప్పకుండా చాలా బలంగానే ఉంటుంది. కానీ అంతకంటే ముందు తెలంగాణ శాసనసభ ఎన్నికలపై కూడా ప్రభావం చూపబోతోందని ఇది స్పష్టం చేస్తోంది.
చంద్రబాబు నాయుడు అరెస్టుపై కేసీఆర్ స్పందించనప్పటికీ ఆయన వైఖరి ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హైదరాబాద్‌లో ఐటి ఉద్యోగులు నిరసనలు చేసినప్పుడు “మీ రాజకీయ పంచాయితీలు ఇక్కడ కాదు… ఏపీకి వెళ్ళి అక్కడ తేల్చుకోమని” మంత్రి కేటీఆర్ చెప్పడం ద్వారా తమ ప్రభుత్వ వైఖరి చెప్పకనే చెప్పారు. కనుక హైదరాబాద్‌లో ఆంద్రా ఓటర్లు కూడా తదనుగుణంగానే వ్యవహరించడం ఖాయమే.





