జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ, “అసలు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయమని జగన్మోహన్ రెడ్డికి ఎవరు సలహా ఇచ్చారో కానీ అది వైసీపిని నిలువునా ముంచేయబోతోందని వైసీపిలో మంత్రులు, ఎమ్మెల్యేలే భయపడుతున్నారట.
ఇదే విషయం తెలుసుకొనేందుకు వైసీపిలోని ఓ పారిశ్రామికవేత్త పార్టీకి ఎన్నికల వ్యూహనిపుణుడుగా చేస్తున్న ప్రశాంత్ కిషోర్‌కు ఫోన్ చేసి అడిగితే తాను అటువంటి సలహాలు ఇవ్వనని చెప్పిన్నట్లు తెలిసింది. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడాన్ని పార్టీలో పలువురు వ్యతిరేకిస్తున్నారని నేను విన్నాను. చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసి జైలుకి పంపడాన్ని రాష్ట్రంలో సామాన్య ప్రజలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారని, ఒకవేళ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపితే ఇక వైసీపికి వినాశనమే అని పార్టీలో అందరూ భయపడుతున్నారు.
పవన్ కళ్యాణ్‌పట్ల కొందరు మాట్లాడుతున్న తీరుపై కూడా వైసీపిలో కొందరు సీనియర్ నేతలు అసహనంగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడుని జైలుకి పంపించి రాజకీయంగా ఓ పెద్ద తప్పు చేసేశారు కనుక ‘వినాశకాలే విపరీతబుద్ది’ అని అనుకోవలసి ఉంటుంది. ఈసారి ఎన్నికలలో ఇదే వైసీపికి శాపంగా మారబోతోంది.
వైసీపిలో ఎవరూ జగన్మోహన్ రెడ్డికి ఎదురుచెప్పలేరు కనుక అందరూ మౌనం వహిస్తున్నారు. ఎవరైనా ధైర్యం చేసి ఆయనకు చెపితే ఏమవుతుందో తెలుసుకోవడానికి నేనే నిదర్శనం. వైసీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్షపూరిత రాజకీయాలు చేయడమే తప్ప రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోవడం లేదని ప్రజలు కూడా భావిస్తున్నారు,” అని అన్నారు.
వైసీపి ప్రభుత్వానికి సుమారు 40-50 మంది సలహాదారులు, ఎన్నికల వ్యూహాలు రచించేందుకు ఐప్యాక్ ఉన్నాయి. కానీ వారిలో ఏ ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైలుకి పంపితే వైసీపిపై ఆ ప్రభావం ఏవిదంగా ఉంటుందని వివరించిన్నట్లు లేదు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పిన్నట్లు, చంద్రబాబు నాయుడుని జైల్లో ఉంచి వేధిస్తూ ఆయన అవినీతికి పాల్పడ్డారని వైసీపి నేతలు ఎంత గట్టిగా వాదించినా ప్రజలలో ఆయనపై సానుభూతి పెరుగుతూనే ఉంటుంది. అది టిడిపికి ఓట్ల రూపంలో వరంగా మారే అవకాశం ఉంటుంది.
చంద్రబాబు నాయుడు దాదాపు నాలుగు వారాలుగా జైల్లో ఉన్నా మోడీ, అమిత్ షాలు కూడా స్పందించకపోవడంతో, వారి అనుమతితోనే జగన్ ప్రభుత్వం ఈ సాహసానికి పూనుకొని ఉండవచ్చని ప్రజలు భావిస్తున్నారు. కనుక రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేసిన చంద్రబాబు నాయుడుని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈవిదంగా వేధిస్తుండటాన్ని సామాన్య ప్రజలు కూడా తప్పు పడుతున్నారు.
కనుక చంద్రబాబు నాయుడుని జైల్లో వేసి టిడిపిని తుడిచి పెట్టేయాలని వైసీపి అనుకొంటే, ఇదే కారణంగా వైసీపి తుడిచిపెట్టుకుపోయే అవకాశం కనిపిస్తోంది.
కానీ పిల్లి మెడలో గంట ఎవరు కడతారు? కనుక కోటంరెడ్డి చెపుతున్నట్లు వైసీపిలో అందరూ మూల్యం చెల్లించాల్సిందే.
—



