ఒకే ఒక్క తప్పు… ఏడాదిలో ఇద్దరి కుర్చీలు తారుమారు!

Chandrababu Naidu arrest sparked sympathy and alliances against Jagan

ఒక్కోసారి రాజకీయాలలో చాలా తెలివైన నిర్ణయమన్నుకున్నదే ఆ పార్టీల పాలిట శాపంగా మారుతుంది. ఇందుకు ఉదాహరణగా 2023లో ఇదే రోజున (సెప్టెంబర్‌ 9) చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ కనిపిస్తోంది.

జగన్‌ అప్పటికే అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నారు. వాటితో తప్పకుండా 175/175 సీట్లు గెలుచుకుంటామని పదేపదే చాలా నమ్మకంగా చెపుతుండేవారు. అంత నమ్మకమున్నప్పుడు చంద్రబాబు నాయుడు జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. కానీ టీడీపిని నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేయాలంటే చంద్రబాబు నాయుడుని అరెస్ట్‌ చేయడం చాలా అవసరమనుకున్నారు. చేశారు. కానీ జగన్‌ అది ఎంతో గొప్ప వ్యూహమనుకుంటే బెడిసికొట్టింది.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడుని అరెస్ట్‌ చేయడం వల్ల ఆయనపై ప్రజలలో సానుభూతి పెరిగింది. ఆయనని అరెస్ట్‌ చేయడం వల్లనే పవన్‌ కళ్యాణ్‌ వెంటనే టీడీపితో పొత్తులు పెట్టుకున్నారు. ఆయనని అరెస్ట్‌ చేయడం వల్లనే నారా లోకేష్‌ నాయకత్వ లక్షణాలు మరోసారి బయటపడ్డాయి. ఈ కారణంగా ప్రజలలో పవన్‌ కళ్యాణ్‌ పట్ల గౌరవం అమాంతం మరింత పెరిగిపోయింది. పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ మద్య బలమైన బంధం ఏర్పడింది. నాడు ఆ బలమైన పునాది పడినందునే నేడు వారిద్దరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి పనిచేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అవడంతో ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ప్రజల మధ్యకు వచ్చి టీడీపికి ప్రజల మద్దతు కూడగట్టారు. దీనికి తోడు తెలంగాణలో అధికారంలో ఉన్న కేటీఆర్‌ చంద్రబాబు నాయుడు పట్ల చులకనగా మాట్లాడటం కూడా జగన్‌, వైసీపీళ పాలిట శాపంగా మారింది.

కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్లు జగన్‌ ఘోర పరాజయానికి కూడా ఇలా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో చంద్రబాబు నాయుడుని అరెస్ట్‌ చేయడం అతి పెద్ద పొరపాటని తాపీగా బోధపడింది. జగన్‌ సంక్షేమ పధకాలతో ముందుకు సాగిపోతున్నప్పుడు ఈ ఒక్క పొరపాటు చేయకపోయి ఉంటే ఆయన భవిష్యత్తు మరోలా ఉండేదేమో?కానీ ఆ ఒక్క తప్పు కుర్చీలను తారుమారు చేసింది. వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదేనేమో?

ADVERTISEMENT
Latest Stories