గన్నవరం టిడిపి కార్యాలయంపై వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడులు చేయడం, వాటిని అడ్డుకోవడానికి వెళ్ళిన టిడిపి నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకి పంపించడంపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకి రాష్ట్రంలో పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వ దమననీతిని వివరిస్తూ ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, “ఇటీవల నేను అనపర్తి, జగ్గంపేట, పెద్దాపురంలో పర్యటించినప్పుడు నన్ను అడ్డుకొనేందుకు, అది సాధ్యంకాక ఇబ్బందిపెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసింది. అయినా నా సభలకి భారీగా జనాలు తరలిరావడంతో సిఎం జగన్మోహన్ రెడ్డిలో అభద్రతాభావం పెరిగిపోయింది. అందుకే గన్నవరంలో టిడిపి కార్యాలయంపై దాడులు, టిడిపి నేతల అరెస్టులు జరిగాయని భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనకి ఇవి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
దేశమంతా భారత్ రాజ్యాంగం అమలులో ఉంటే ఒక్క ఏపీలో మాత్రం జగన్ రాజ్యాంగం అమలులో ఉంది. జగన్ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వారిపై పోలీస్ కేసులు, వేధింపులు మొదలైపోతాయని గన్నవరం ఘటనలు మరోసారి నిరూపించాయి. రాష్ట్రంలో సామాన్య ప్రజలకు, మహిళలకు, బడుగు బలహీనవర్గాలు మైనార్టీ ప్రజల ధనమాన ప్రాణాలకు భద్రత లేకుండాపోయింది.
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేదు. రైతులకు ధాన్యం బకాయిలు, కాంట్రాక్టర్లకు బిల్లులు బకాయిలు చెల్లించదు ఈ ప్రభుత్వం. ఏమని నిలదీసి అడిగితే వేధింపులు మొదలైపోతాయి. రూ.1,100 కోట్ల సంకల్పసిద్ధి స్కామ్‌లో వైసీపీ ఎమ్మెల్యే, నేతల బండారం బయటపెట్టినందుకే టిడిపి రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నాని, చివరికి ఆయన భార్యాపిల్లలని కూడా పోలీసులు వేధించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఈ ఆగడాలన్నీ మీడియా రికార్డ్ చేస్తోందని తెలిసి ఉన్నా ఎవరూ భయపడి వెనక్కు తగ్గకపోవడం వారి దురహంకారానికి నిదర్శనం. పోలీసుల ఎదుటే వైసీపీ గూండాలు టిడిపి కార్యాలయంపై దాడులు చేస్తే వారిని అడ్డుకోలేక టిడిపి నేతలపై ఎదురు కేసులు బనాయించడం సిగ్గుచేటు. వైసీపీ నేతలకు కొమ్ముకాస్తున్న పోలీసులందరూ భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించక తప్పదు.
వైసీపీ దౌర్జన్యాలకి, దాడులకి టిడిపి భయపడబోదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజలని వైసీపీ బారి నుంచి కాపాడేందుకు నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. ధర్మానికి, అధర్మానికి మద్య, ప్రజలకి పాలకులకి మద్య జరుగుతున్న ఈ పోరాటంలో నేను ఏ స్థాయి పోరాటానికైనా సిద్దమే. ప్రజలు కూడా తమ, తమ పిల్లల భవిష్యత్ కోసం పోరాడవలసిన సమయం ఆసన్నమైంది,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.



