అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాదరణ పొందే నిర్ణయాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో, వివాదాలకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మాత్రం మొదటి నుంచి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ విమర్శల పాలవుతున్నారు.
ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించిన తర్వాత నిర్ణయాలు వెనక్కు తీసుకోవడం పరిపాటిగా మారిపోయింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన వ్యక్తిగత జ్యోతిష్కుడు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్‌డీ (ఆఫీసర్ ఆన్‌లైన్‌లో స్పెషల్ డ్యూటీ) నియమించారు.
అయితే ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శించడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది.
తాజాగా విజయ్ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ నిర్మాత కె. వెంకట నారాయణను ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించడంతో మళ్ళీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనతో సినిమా చేసి అయన నష్టపోయారు కనుక ఆయనకు సొంత డబ్బుతో నష్టపరిహారం ఇస్తే ఎవరూ అభ్యంతరం చెప్పరు.లేదా భవిష్యత్‌లో ఆయన కోసం ఉచితంగా సినిమా చేసి పెట్టినా ఎవరూ తప్పు పట్టరు. కానీ తన వలన అయనకు కలిగిన నష్టానికి ప్రభుత్వం తరపున ఈవిధంగా మంత్రి హోదా కలిగిన పదవితో భర్తీ చేయాలనుకోవడమే తప్పని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇది అధికార దుర్వినియోగమేనని వాదిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేయాల్సిన కీలకమైన ఈ బాధ్యతని ఓ సినీ నిర్మాతకు కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి.
కనుక జోసెఫ్ విజయ్ ఈ విమర్శలకు తలొగ్గి ఈ నియామకాన్ని కూడా రద్దు చేస్తారా లేదా మొండిగా అమలు చేసి విమర్శలు మూటకట్టుకుంటారా?
కానీ జోసెఫ్ విజయ్‌లో “నేనింతే… తగ్గేదేలే!” అనే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. కొత్తగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వ్యక్తి ఇంత ధైర్యంగా ఉండటం అవసరమే కానీ అదే ఒక్కోసారి కొంప ముంచవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో అలా మునిగిన రాజకీయ నాయకులు చాలా మందే ఉన్నారు కదా!




