“వైసీపి ఓ మునిగే పడవ వంటిది. దానిలో ఎవరుండాలని కోరుకొంటారు?కొందరినీ జగన్ ఇదివరకే స్వయంగా బయటకు పంపించేశారు. ఇప్పుడు 11 మందిని మార్చేశారు. త్వరలో మరో 60 మందిని పక్కన పెట్టేయాలనుకొంటున్నారు. బహుశః ఎన్నికల గంట మ్రోగేసరికి 151 మందిని బయటకు పంపించేస్తారేమో? కానీ పంపించేస్తే వారికే చాలా మంచిది. అయినా ఒక నియోజకవర్గంలో పనికిరానివారు మరో నియోజకవర్గంలో పనికివస్తారా… చెల్లుతారా?,” అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వ్యంగ్యంగా అన్నారు.
“జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం మొదలైంది. అందుకే ఎన్నికలకు ముందు నియోజకవర్గం ఇన్‌చార్జిలను ఎమ్మెల్యేలను మార్చేయాలని చూస్తున్నారు. ఆయన 151 మందినీ మార్చేసినా మాకేమీ నష్టం లేదు. పైగా మేలే జరుగుతుంది. జగన్ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా రాబోయే ఎన్నికలలో వైసీపి ఓడిపోవడం ఖాయం,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
“ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేతిలో పెడితే నాలుగున్నరేళ్ళలో సర్వనాశనం చేసేసి అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపి నేతలు కూడా ఆయన బాటలోనే నడుస్తూ అయిన కాడికి రాష్ట్రాన్ని దోచుకొంటున్నారు.
ఇటువంటి గొప్ప రికార్డ్ ఉన్నవారిని మరో జిల్లా లేదా నియోజకవర్గానికి బదిలీ చేస్తే ప్రజలు గెలిపిస్తారని జగన్ ఏవిదంగా అనుకొంటున్నారో? జగన్ పాలనతో వేసారిపోయి ఉన్న ప్రజలు గద్దె దించి ఇంటికి సాగనంపేందుకు ఎదురుచూస్తున్నారు,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
‘మా నమ్మకం నువ్వే జగన్’ అని మంత్రులు, ఎమ్మెల్యేల చేత జగన్ చెప్పిస్తున్నారు. వారు కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోని చూసే తమకి ఓట్లు వేయమని అడుగుతున్నారు. కానీ ఆయనకు వారిపై నమ్మకం పోయిందిప్పుడు. కనుక వారికీ ఆయనపై నమ్మకం పోకుండా ఉంటుందా? సైన్యంపై నాయకుడికి, నాయకుడిపై సైన్యానికి నమ్మకం లేకపోతే యుద్ధంలో ఎలా గెలుస్తారు?




