ఆంధ్రప్రదేశ్ ను డిజిటల్ మయం చేయాలనేది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష. దీనికి సంబంధించి ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా 149 రూపాయలకే అన్ని సదుపాయాలు కలుగజేయాలని ప్రణాళికలు రూపొందించారు. అయితే ఇది పట్టాలెక్కడంలో ఆలస్యం కావడంతో, అసలు కార్యరూపం దాలుస్తుందా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే ఎట్టకేలకు దీనికి ఓ రూపాంతరం వచ్చిందని, త్వరలోనే ఏపీని డిజిటల్ మయం కానుందన్న సమాచారం బయటకు వచ్చింది.
కేబుల్ టీవీ (ఐపీ టీవీ), ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాలను అందించే ట్రిపుల్ ప్లే బాక్సుల సమస్య కొలిక్కి రావడంతో జూలై నాటికి రెండు లక్షల ఇళ్లు పూర్తి డిజిటల్ గా మారిపోనున్నాయి. అలాగే డిసెంబరు నాటికి 10 లక్షల ఇళ్లకు కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ట్రిపుల్ ప్లే బాక్స్ ల సరఫరాలో జాప్యం కారణంగా ఆలస్యమైన ప్రాజెక్టు మళ్లీ ఊపందుకుంది. చైనా నుంచి ఈ బాక్సులు వస్తుండడంతో పాటు శ్రీసిటీలోని ఫాక్స్ కాన్ కంపెనీ బాక్సుల తయారీకి మొగ్గుచూపడంతో ప్రాజెక్టులో కదలిక వచ్చింది.
ఒకే కనెక్షన్ ద్వారా కేవలం 250 రూపాయలకే ఫోన్, టీవీ, ఇంటర్నెట్‌ను అపరిమితంగా వాడుకునే ఏపీ ఫైబర్ ప్రాజెక్టులో భాగంగా విద్యుత్ స్తంభాల ద్వారా ప్రతి పట్టణం, మేజర్ పంచాయతీల వరకు 23 వేల కిలోమీటర్ల పొడవునా ఓఎఫ్‌సీ వేయడం ఇప్పటికే పూర్తయింది. దీంతో పైన చెప్పిన మూడు ప్రసారాలు ఒకే రింగ్ విధానంలో ఉండడంతో, ఒక చోట కేబుల్ కట్ అయినా రెండో వైపు నుంచి ప్రసారాలు కొనసాగుతాయి. కాబట్టి ప్రసారాల్లో అంతరాయం ఉండదు.
విశాఖ కేంద్రంగా జరిగే ప్రసారాల్లో జిల్లాల్లో ఎక్కడైనా అవాంతరం ఎదురైతే ప్రసారాలు ఆగిపోకుండా ఉండేందుకు భూగర్భ కేబుళ్ల ద్వారా సేవలు అందించేందుకు రిలయన్స్, ఎయిర్‌టెల్ నుంచి ప్రత్యామ్నాయ కనెక్షన్లు ఉన్నాయి. ఇక విశాఖ ఏజెన్సీలోని వందలాది గిరిజన గూడేలకు ఏపీ ఫైబర్ సేవలు అందనుండడం విశేషం. దారకొండ లాంటి మారుమూల ప్రాంతంలోనూ ఇక ఫోన్లు రింగవనున్నాయి. ఈ డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వినియోగదారులు అనేక సదుపాయాలను పొందనున్నారు.
సెట్ టాప్ బాక్స్ సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చేస్తుంది. స్మార్ట్ ఫోన్లలోని యాప్ లలానే టీవీలోనూ యాప్‌లను ఉపయోగించుకునే వెసులుబాటు లభిస్తుంది. యూట్యూబ్ వంటి వాటిని పదుల సంఖ్యలో నేరుగా టీవీలోనే వీక్షించవచ్చు. బ్లూ టూత్ తో కనెక్ట్ చేసి కీబోర్డు, మౌస్ తో టీవీని కంప్యూటర్ లా మార్చేయవచ్చు. టీవీ కార్యక్రమాలను ఎంతసేపైనా ఉచితంగా రికార్డు చేసుకోవచ్చు. ఉచిత సినిమాలు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని ఉచితంగా పొందవచ్చు.
భవిష్యత్తులో కొత్త సినిమాలను నేరుగా టీవీలో చూసే అద్భుతమైన అవకాశం. ఇక ఫోన్లో ఎంతసేపైనా ఉచితంగా మాట్లాడుకోవచ్చు. అన్నీ హెచ్‌డీ చానళ్లే. అదనపు రుసుము లేకుండా 250 చానళ్లను చూసుకోవచ్చు. వీటితో పాటు వాణిజ్య అవసరాలకు, స్కూళ్లు, వ్యవసాయానికి కూడా ఫైబర్ గ్రిడ్ ద్వారా సేవలు అందనున్నాయి. వచ్చే ఏడాది లోపున ఈ ప్రాజెక్ట్ ఏపీ వ్యాప్తంగా కార్యరూపం దాలిస్తే… ప్రజలను డిజిటల్ యుగం దిశగా పరిగెత్తించాలన్న చంద్రబాబు కల నెరవేరుతుందని చెప్పడంలో సందేహం లేదు.



