టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బుదవారం అమరావతి టిడిపి కార్యాలయంలో రాయలసీమలో సాగు, త్రాగునీటి ప్రాజెక్టుల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తమ హయాంలో రాయలసీమలో ఎక్కడెక్కడ ఎన్ని ప్రాజెక్టుల పనులకు ఎంత ఖర్చు చేసి ఏమేరకు పనులు పూర్తిచేశారో చంద్రబాబు నాయుడు వివరించారు.
ఈ నాలుగేళ్ళలో ఆయా ప్రాజెక్టులలో పెండింగ్ పనులకు జగన్ ప్రభుత్వం అరకొర నిధులు ఇచ్చిందని, ప్రాజెక్టులలో పనులు జరగనప్పటికీ వైసీపీ నేతలు కమీషన్లు మాత్రం దిగమింగుతున్నారని చంద్రబాబు నాయుడు ఆక్షేపించారు.
సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా రాయలసీమకు చెందినవాడే అయినప్పటికీ సీమ జిల్లాలకు సాగు, త్రాగు నీటిని అందించే ప్రాజెక్టులలో ఏ ఒక్కదానినీ పూర్తిచేయలేదని, పైగా తన అవగాహనా రాహిత్యంతో సాగునీటి రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని చంద్రబాబు నాయుడు విమర్శించారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీమ జిల్లాలోని ప్రతీ ప్రాజెక్టుని స్వయంగా పరిశీలించి, ఎక్కడెక్కడ ఏ మేరకు పనులు పెండింగులో ఉన్నాయో నోట్ చేసుకొని, యుద్ధప్రాతిపదికన వాటిలో చాలా వాటిని పూర్తి చేసానని చెప్పారు. అయితే సిఎం జగన్మోహన్ రెడ్డికి సాగుత్రాగు నీటి ప్రాజెక్టుల గురించి ఎటువంటి అవగాహన లేకపోవడంవలన మిగిలిన 20-30 శాతం పనులు చేయించకుండా నిర్లక్ష్యం వహించడంతో చాలా ప్రాజెక్టుల పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చిందని అన్నారు.
తమ ప్రభుత్వం 2014-2019లో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.68,293 కోట్లు ఖర్చు పెడితే, జగన్ ప్రభుత్వం ఈ నాలుగేళ్ళలో కేవలం రూ.22,.165 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టిందని చంద్రబాబు నాయుడు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారుతున్న కృష్ణాగోదావరి రెండు నదులను అనుసంధానం చేస్తేనే అనేక జిల్లాలకు సాగు,త్రాగు నీరు అందుతుందని అదే మిగిలిన నాధులను కూడా అనుసంధానం చేస్తే రాష్ట్రంలో ఎక్కడా నీటికి ఇబ్బందే ఉండదని అన్నారు. తాను పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్ళు అందించిన విషయాన్ని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
రాయలసీమ జిల్లాలకు సరైన నీటి వసతి కల్పిస్తే అక్కడి రైతులు ఏడాదికి మూడు పంటలు పండించగల సమర్ధులని చంద్రబాబు నాయుడు ప్రశంశించారు. రాయలసీమ జిల్లాలలో ఉద్యానవన పంటలకు అనుకూలంగా ఉంటుందని గుర్తించి తాను ఆనాడే అందుకు తగ్గట్లుగా పలు ప్రాజెక్టులలో అవసరమైన మార్పులు చేర్పులు చేయించి నీటిని అందించేందుకు ప్రయత్నించానని చెప్పారు.
వాటిని జగన్ ప్రభుత్వం పూర్తిచేసి ఉండి ఉంటే నేడు రాయలసీమలో రత్నాలు పండేవని చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డికి వ్యవసాయం, సాగునీటి రంగాలపై ఎటువంటి అవగాహన లేకపోవడంతో రాష్ట్రంలో అన్ని సాగునీటి ప్రాజెక్టులను భ్రష్టు పట్టించేశారని చంద్రబాబు నాయుడు విమర్శించారు.
రాయలసీమకు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయానంత ద్రోహం జగన్ చేశారని, కనుక ఆయన ‘రాయలసీమ ద్రోహి’ అని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 192 ప్రాజెక్టులను, ఒక్క రాయలసీమలోనే 102 ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం ప్రీ-క్లోజ్ చేసిందని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్ళీ వాటన్నిటినీ తెరిపించి పనులు పూర్తి చేయిస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
వైసీపీ నేతలు ప్రాజెక్టులలో నుంచి విచ్చలవిడిగా ఇసుక తవ్వుకుపోతుండటంతో ఆయా ప్రాజెక్టులు దెబ్బ తింటున్నాయని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాయలసీమకు మళ్ళీ సాగుత్రాగు నీరు అందాలంటే అది టిడిపి ప్రభుత్వం వల్లనే సాధ్యం అవుతుందని చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు.



