తెరాస పార్టీగా ఉన్న ప్రాంతీయ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని ఆలోచించిన కేసీఆర్ ఆ పార్టీ నాయకులు తమ సంకుచిత బుద్దిని మాత్రం వదులుకో లేకపోతున్నారు. రాష్ట్ర విభజన జరిగి దశబ్దం గడుస్తున్నా ఇంకా తెలంగాణ వాదాన్నే నమ్ముకుని బిఆర్ఎస్ రాజకీయ చేయాలనుకోవడం ఎంత వరకు సమంజసం.?
రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారాయి. దానితో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి తొలి అడుగు వేసిన ఇరు రాష్ట్రల ముఖ్యమంత్రులు హైద్రాబాద్ ప్రజాభవన్ వేదికగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఐదేళ్ల అవమానాలు, అపహాస్యాలు తరువాత ముఖ్యమంత్రిగా గెలిచి మొదటిసారి తెలంగాణకు వచ్చిన బాబుకు అక్కడ ఘనస్వాగతం లభించింది.
అటు పార్టీ కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బాబుకి రెడ్ కార్పెట్ పరచటంతో తమ అసూయను, ఆక్రోశాన్ని మరోసారి బయటపెట్టారు బిఆర్ఎస్ నాయకులు. ఏపీ నాయకుల పెత్తనం తెలంగాణకు అవసరమా.? ఏపీ పార్టీలు తెలంగాణలో రాజకీయాలు మొదలు పెడుతున్నాయి.? పెళ్లి ఏపీలో జరిగితే పందిర తెలంగాణలో వేస్తున్నారు అంటూ బిఆర్ఎస్ బాబు పై మరోసారి విషం చిమ్మింది.
పార్టీలుగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సామరస్య వాతావరణం రెండు రాష్ట్రాల ప్రజలకు అత్యంత అవసరం. గత ఐదేళ్లుగా వైసీపీ జెండాకు కాపు కాసి, జగన్ కు లోపాయకారి మద్దతు పలికిన బిఆర్ఎస్ ఇప్పుడు టీడీపీ పై నిప్పులు చేరగడం చూస్తుంటే బిఆర్ఎస్ కు టీడీపీ పార్టీ అంటే భయమా.? లేక బాబు అంటే అసూయా.?
బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అంటూ వైసీపీ కి ఒత్తాసు పలికిన కేసీఆర్ చివరికి అదే టీడీపీ మద్దతుదారుల నుండి రిటర్న్ గిఫ్ట్ అందుకుని తెలంగాణ నుండి బిఆర్ఎస్ పార్టీని దాదాపు కనుమరుగు చేసుకున్నారు. ఏపీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఏపీ రాజకీయాలలో గులాబీ రంగును పరిచయం చేసినా ఏనాడూ బాబు కానీ టీడీపీ పార్టీ నేతలు కానీ కేసీఆర్ ను కానీ బిఆర్ఎస్ పార్టీని కానీ తప్పుపట్టలేదు.
రాజకీయాలలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చెయ్యొచ్చు, ప్రజల ఆదరణ ఉంటే ఎవ్వరైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనే ప్రాథమిక హక్కును గౌరవిస్తూ బాబు కేసీఆర్ రాజకీయాలలో వేలు కాదు కదా గోరు కూడా పెట్టలేదు. కానీ బిఆర్ఎస్ మాత్రం టీడీపీ పార్టీని అడ్డుపెట్టుకుని బాబును బూచిగా చూపిస్తూ ఎప్పుడు తెలంగాణ వాదాన్ని రెచ్చకొట్టి రాజకీయ లబ్ది పొందాలనే భావిస్తుంది.
బాబు జైలుకు వెళ్లిన నాటి నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు కూడా అనధికారికంగా జగన్ కు మద్దతు పలికిన కేసీఆర్ తానూ ఓడిపోయినప్పటికీ వైసీపీ గెలుపు కోసం తెర వెనుక రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. ఎపుడు బాబు ఓటమిని టీడీపీ పతనాన్ని కోరుకున్న బిఆర్ఎస్ పార్టీని కానీ ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను కానీ బాబు ఏనాడూ పల్లెత్తి మాటకూడా అనలేదు.
తనకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ నాయకులు ఇన్ని ప్రకటనలు చేస్తున్న బాబు మాత్రం బిఆర్ఎస్ పై ప్రేమ చూపిస్తూనే ఉన్నారు. తానూ ఐటీ రంగంతో హైద్రాబాద్ కు వేసిన అభివృద్ధి అనే పునాదిని అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ కొనసాగించాయి తప్ప విధ్వంసం చెయ్యలేదన్నారు.
అందుకు ఈ రెండు పార్టీలకు, ఈ రెండు పార్టీల ముఖ్యమంత్రులకు నా ధన్యవాదాలు అంటూ బాబు కేసీఆర్ పై కూడా మంచి అభిప్రాయాన్నే వెల్లడించి తన మంచి తనాన్ని, రాజకీయాల్లో హుందాతనాన్ని మరోసారి సమాజానికి నిరూపించారు. తెలంగాణ అభివృద్ధికి హైద్రాబాద్ వంటి మహా నగర నిర్మాణమే మూలస్తంభం. ఆ స్తంభానికి కేసీఆర్ కూడా మరో స్తంభాన్ని ఏర్పాటు చేశారు కానీ దాన్ని కూల్చలేదని కేసీఆర్ ను కొనియాడారు బాబు.
అయితే అది వేసిన బాబు ముందు చూపును అభినందించడానికి కానీ ప్రశంసించడానికి కానీ ముందుకు రాని బిఆర్ఎస్ బాబు మీద విమర్శలు చేయడానికి మాత్రం ఒంటి కాలు మీద వస్తుంది. తన ఓటమిని కోరుకుంటూ, తెలంగాణలోనే పురుడు పోసుకున్న టీడీపీ పతనాన్ని ఆకాంక్షిస్తూ, తన కారుతో సైకిల్ ను నామరూపాలు లేకుండా చేయాలనుకుని బిఆర్ఎస్ నిత్యం బాబు మీద ఎంత విషం చిమ్మినా బాబు మాత్రం తన ప్రేమతోనే వారికి సమాధానము చెపుతున్నారు.




