టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు రెండు మూడు రోజులలోనే ఆయన బయటకు వచ్చేస్తారని ప్రజలు, టిడిపి నేతలు కూడా భావించారు. కానీ 41 రోజులైనా ఇంతవరకు బయటకు రాలేకపోయారు.
అయితే కేవలం న్యాయపరమైన కారాణాల వల్లనే చంద్రబాబు నాయుడుకి విముక్తి లభించడం లేదని ఎవరూ అనుకోవడం లేదు. తెర వెనుక రాజకీయ అవసరాలు, ఒత్తిళ్ళు, లెక్కలు చాలానే ఉన్నాయని అందరికీ తెలుసు. కారణాలు ఏవైతేనేమీ చంద్రబాబు నాయుడుకి జైలు నుంచి విముక్తి లభించడం లేదు.
అదే… ఆయన స్థానంలో తెలంగాణ సిఎం కేసీఆర్ అవినీతి కేసులలో అరెస్ట్ అయ్యుంటే కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు జైల్లో పెట్టగలిగేదా?అంటే సాక్షాత్ మోడీ, అమిత్ షాలే స్వయంగా ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నా అరెస్టు చేసేందుకు కూడా సాహసించలేకపోతున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చెపుతున్నారు.
బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉన్నందునే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవితని కూడా అరెస్ట్ చేయడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేసినా తెలంగాణ అగ్నిగుండంగా మారే ప్రమాదం ఉంటుందని బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. కేసీఆర్ దీనిని తెలివిగా బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మలుచుకొని లాభపడతారనే భయం కూడా ఉంది. అందుకే తెలంగాణ బీజేపీ నేతలు ఎంతగా ఒత్తిడి చేసినా కల్వకుంట్ల కవిత జోలికి వెళ్ళేందుకు సాహసించలేదని చెప్పవచ్చు.
కల్వకుంట్ల కవితనే టచ్ చేయలేకపోతున్నప్పుడు ఇక కేసీఆర్‌ని ఎలా టచ్ చేయగలరు?కనుక ఆ ప్రశ్నే తలెత్తదు.
చంద్రబాబు నాయుడు కంటే కేసీఆరే మోడీని చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. అసలు ప్రధాని పదవికి మోడీ పనికిరారని, దేశానికి ఆయన పాలన అరిష్టమని కేసీఆర్ అనేశారు. కానీ మోడీ ఆయనను టచ్ చేయలేకపోతున్నారు!
చేయలేక కాదు. రాజకీయ అవసరాలు, కూడికలు, తీసివేతలు, తెరచాటు అవగాహనాలు వగైరా అనేక అంశాలు అందుకు కారణం అయ్యుండవచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అణగద్రొక్కేయాలనుకొన్నా తొక్కేయాలని విదంగా కేసీఆర్ తన చుట్టూ పటిష్టమైన రాజకీయ భద్రతావలయం సృష్టించుకొన్నారని అర్దమవుతోంది.
చంద్రబాబు నాయుడు కూడా మోడీతో పోరాటం చేసినప్పటికీ, 2019 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత రాజీకి ప్రయత్నించడం మొదలుపెట్టారు. అందుకు ఆయన కారణాలు ఆయనకు ఉండి ఉండవచ్చు. కానీ ఆయన కూడా ప్రత్యామ్నాయ మార్గాలలో సాగి ఉంటే ఏమై ఉండేదో?
మరో విషయం అతి ముఖ్యమైన ఏమిటంటే, మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురూ తమ రాజకీయ శత్రువులనుఏనాడూ ఉపేక్షించలేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు కూడా వారిలాగ శత్రువులపట్ల కటినంగా వ్యవహరించి ఉండి ఉంటే నేడు ఈ దుస్థితి ఎదురయ్యేదే కాదేమో?
కానీ చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యానికి కట్టుబడి వైసీపి, జగన్ పట్ల కూడా మెతక వైఖరిని అవలభించారు. అది తప్పని ఇప్పుడు రుజువైంది. ఆలాగే కేసీఆర్‌తో మనకెందుకు గొడవలని ఉదాసీనంగా వ్యవహరించడం కూడా తప్పని 2019 ఎన్నికలలో రుజువైంది. మోడీతో కయ్యానికి కాలు దువ్వడం కూడా సరికాదని ఆ ఎన్నికలలోనే రుజువైంది.
చివరికి 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు రాజకీయ శత్రువులందరూ ఏకం అయ్యి ఆయనను దారుణంగా దెబ్బతీశారు. ఆ శత్రువులందరూ నేటికీ ఒకే తాటిపై ఉన్నారని, అందుకే ఆయనకు విముక్తి లభించడం లేదని భావించవచ్చు.
కనుక ఇప్పటికైనా టిడిపి కొత్త ఆలోచనలతో, కొత్త దారిలో పయనించడం చాలా అవసరమని చెప్పకతప్పదు. ఇంకా మూస రాజకీయాలతో ముందుకు సాగితే, వైసీపి మంత్రులు హెచ్చరిస్తున్నట్లు రాష్ట్రంలో టిడిపి కనబడకుండా మాయం అయిపోయే ప్రమాదం పొంచి ఉంది.






