రోజూ అప్ డేట్ అవుతోన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేని పక్షంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూస్తే అర్ధమవుతుంది. టెక్నాలజీ విషయంలో యువవయసులో ఉన్న జగన్ కన్నా, ఆరు పదుల వయసు దాటిన చంద్రబాబుకు ఎక్కువ పరిజ్ఞానం ఉందన్న విషయం జగమెరిగిన సత్యమే. అయితే ఈ విషయాన్ని ఒప్పుకుంటూ పరోక్షంగా ఏపీ అసెంబ్లీలో జగన్ చెప్పకనే చెప్పాడు.
రెండవ రోజు ఉదయం ప్రశ్నోత్తరాల వేళ, 50 యూనిట్ల కన్నా తక్కువగా విద్యుత్ వాడే పేదలకు ఉచిత విద్యుత్ పథకంపై ప్రశ్న రాగా, మంత్రులు అచ్చెన్నాయుడు, గంటాలు సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో తనకు మైకు కావాలని కోరిన జగన్, ఈ సందర్భంగా మాట్లాడుతూ… “ఇంతకుముందు కొద్దొ గొప్పో మైకులు ఆన్ లో ఉన్నాయా? లేదా? అన్నది మాకు తెలిసేది. ఇప్పుడు మైక్ ఆన్ లో ఉందో లేదో తెలియడంలా. ఎందుకు మీరు ఆఫ్ చేస్తున్నారో కూడా తెలియడంలా. దీని దిక్కు చూడాల్నో, మీ దిక్కు చూడాల్నో మాకు అర్థం కావడంలా” అని వ్యాఖ్యానించారు.
జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు అసెంబ్లీలో నవ్వులు పూయించాయి. స్పీకర్ కోడెల శివప్రసాద్ తో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఇతర శాసన సభ్యులు నవ్వుతూ ఉండటం కనిపించింది. పాత సంప్రదాయ మైకుల స్థానంలో అత్యాధునిక సెన్సార్లు వాడుతూ సౌండ్ సిస్టమ్ ను అసెంబ్లీలో ఏర్పాటు చేయడంతో జగన్ ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. దీంతో ప్రతిపక్ష నేత జగన్ ‘అప్ డేట్’ అవ్వాలి అంటున్నారు వీక్షకులు. ఎప్పుడూ తన వ్యాఖ్యలతో అసెంబ్లీలో రచ్చ రచ్చ చేసే జగన్, అమరావతిలో జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలలో ఆహ్లాదకరంగా స్పందించడం విశేషం.



