చంద్రబాబు న్యాయవాదులు దాని కోసం ఎందుకు పట్టుబడుతున్నారు?

Chandrababu-Naidu-Lawyersస్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని జగన్‌ ప్రభుత్వం అరెస్ట్ చేసి అప్పుడే 35 రోజులవుతోంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు తరపున సుప్రీంకోర్టులో వాదిస్తున్న న్యాయవాదులు ప్రధానంగా సెక్షన్ 17ఏ గురించే గట్టిగా వాదిస్తున్నారు.

ADVERTISEMENT

వారు చంద్రబాబు నాయుడుకి బెయిల్‌ సాధిస్తారనుకొంటే సెక్షన్ 17ఏ గురించి రోజుల తరబడి వాదిస్తున్నారని టిడిపి కార్యకర్తలు బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడుకి వీలైనంత త్వరగా బెయిల్‌ సాధించాలనే విషయం సుప్రీంకోర్టులో వాదిస్తున్న సీనియర్ న్యాయవాదులకు తెలియదనుకోలేము.

అయితే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌తో సహా టిడిపిలో పలువురు నేతలపై వరుసపెట్టి కేసులు నమోదు చేస్తూ అందరినీ జైలుకి పంపించాలని వైసీపి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందున, ముందుగా వాటి నుంచి వారికి పూర్తి రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతోనే న్యాయవాదులు ఈ సెక్షన్ 17ఏ గురించి గట్టిగా పట్టుబడుతున్నారని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ వారి వాదనలతో సుప్రీంకోర్టుని ఒప్పించగలిగితే, చంద్రబాబు నాయుడుతో సహా టిడిపి నేతలపై జగన్‌ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే కేసులు నమోదు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకి నమ్మకం కలుగుతుంది. అప్పుడు సెక్షన్ 17ఏని ఖచ్చితంగా అమలుచేయాలని జగన్‌ ప్రభుత్వాన్ని ఆదేశిస్తే చంద్రబాబు నాయుడుతో సహా టిడిపి హయాంలో మంత్రులుగా చేసినవారెవరినీ నేరుగా అరెస్ట్ చేయలేదు.

వారిని అరెస్ట్ చేయాలంటే సెక్షన్ 17ఏ ప్రకారం ముందుగా గవర్నర్‌ అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అయితే సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయిన అబ్దుల్ నజీర్ ప్రస్తుతం ఏపీ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కనుక జగన్‌ ప్రభుత్వం ఆయనను కేసులు, సెక్షన్లతో మభ్యపెట్టలేదు. టిడిపి నేతల అరెస్టులకు అనుమతి పొందలేదు.

అందుకే చంద్రబాబు నాయుడు న్యాయవాదులు సెక్షన్ 17ఏ గురించి ఇంతగా పట్టుబడుతున్నారు. కనుక టిడిపి నేతలు, కార్యకర్తలు వారి ప్రయత్నాలను అపార్ధం చేసుకోవడం సరికాదు.

ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టులలో చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా తీర్పులు వచ్చేలా చేయగలుగుతున్నారు. సుప్రీంకోర్టులో వాదిస్తున్న న్యాయవాదులు చంద్రబాబు నాయుడుని బయటకు తీసుకు రావడమే కాదు… సెక్షన్ 17ఏ ద్వారా టిడిపిలో ముఖ్య నేతలకు ఇకపై న్యాయపరంగా ఓ రక్షణ కవచం కూడా ఏర్పాటుచేయాలని ప్రయత్నిస్తున్నారు. కనుక కనుక టిడిపి నేతలు, కార్యకర్తలు మరికాస్త ఓపిక పడితే మంచిది.

ADVERTISEMENT
Latest Stories