కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కసారి గళం విప్పారో లేదో… ఆ స్వరాన్ని ఎలాగైనా పాతాళంలోకి తోక్కేయాలన్న ప్రయత్నం జరుగుతోందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు. గడిచిన నాలుగేళ్లల్లో మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా చంద్రబాబు పలకడంతో… తమకు ఇష్టం వచ్చిన కధనాలతో నేషనల్ మీడియా అంతా గగ్గోలు పెడుతోంది. దేశానికి ‘ఎమర్జెన్సీ’ ఏదో వచ్చేసినట్లుగా చంద్రబాబుపై ఒకరిని మించి మరొకరు తప్పుడు కధనాలతో మీడియా “స్వేఛ్చ”ను వాడుకుంటున్నారు.
తప్పుడు కధనాలను ప్రచురించడం అనేది ఏ ఒక్క మీడియా సొంతం కాదు అనే విధంగా ఒక దానిని మించి మరొకటి ప్రసారం చేయడం… వారి బుద్ధిహీనతను చాటుకుంటోంది. ప్రాంతీయంగా జగన్ ‘సాక్షి’ మీడియా ఇందులో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోండగా, ప్రాంతీయత కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్లుగా జాతీయ మీడియా వర్గాలు వ్యవహరించడం విస్మయానికి గురిచేసే అంశం. అంతర్లీనంగా తెలుగు వారి ‘స్వరం’ పైకి లేవగానే అణిచివేయాలనే సంకల్ప బలం ఇందులో ఎక్కువగా కనపడుతోంది.
ఇంతకీ జాతీయ మీడియా ఛానల్స్ ఏం రాసాయో తెలుసా? బహుశా ఆ వ్యాఖ్యలు చదివిన తర్వాత జగన్ ‘సాక్షి’ కూడా ఇంత దారుణంగా రాయదేమో అని ప్రతి ఒక్కరికి అనిపించకపోదు. పలు ఉదాహరణలు పరిశీలిస్తే… కేంద్ర స్థాయిలో ఎలాంటి రాజకీయాలు చేయాలి.., ప్రత్యేక హోదా విషయమై ఎలా అనుసరించాలి… అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారట. 2018లో ఇప్పటివరకు ఇదే ‘బెస్ట్ జోక్’గా అభివర్ణించడానికి నూటికి నూరు శాతం అర్హతను సంపాదించుకుంది ఈ కధనం.
జగన్ ను అడిగి తెలుసుకున్నారు అనే కంటే కూడా… అకాల మరణం చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసారు… అని ప్రసారం చేసినా కాస్త నమ్మశక్యంగా ఉండేదేమో! జాతీయ మీడియా వర్గాల తీరుకు నిదర్శనంలో ఇదొక భాగమే. ఇదే స్థాయిలో ఇతర ఛానల్స్ కూడా తామేం తక్కువ తినలేదు అని నిరూపించుకున్నాయి. ఏపీ స్థానంలో తెలంగాణా రాష్ట్రాన్ని పెట్టి ‘స్పెషల్ స్టేటస్’పై ట్వీట్ చేయడం ఒక ఛానల్ వంతయితే… బిజెపి + వైసీపీ కలిసి పోటీచేస్తే టిడిపి ఓటమి పాలవుతుందని మరో ఛానల్ చంద్రబాబును తొక్కే విధంగా ప్రసారాలు చేసింది.
అన్నీ ఛానల్స్ మూకుమ్మడిగా ఒకేసారి ఎందుకు చంద్రబాబు మీద ‘ఎటాక్’ చేస్తున్నాయి అనేది బహిరంగ సత్యమే. కేంద్రంలో అధికారంలో ఉన్న వారికి కొమ్ముకాసే ఛానల్స్ కొన్నయితే, దక్షిణాది రాష్ట్రాల మీద వివక్షను ప్రదర్శించే ఛానల్స్ మరికొన్ని! ఏది ఏమైనా… అంతిమంగా… ఢిల్లీ గడ్డపై తెలుగోడి గొంతు నోక్కేయడానికి చేస్తోన్న ప్రయత్నాలలో ఓ భాగం మాత్రమే ఇవి! వీటికి ‘తానా తందానా’ అంటూ వారితో ‘టై అప్’ పెట్టుకున్న ప్రాంతీయ మీడియా ఛానల్ సంగతి అందరికీ తెలిసిందే.



