
ఎన్నికల హామీలు ఇవ్వడం తేలిక. అమలు చేయడమే కష్టం. చేయకపోతే ప్రతిపక్షాలు, వారి సొంత మీడియా ఊరుకోవు. ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపిస్తూనే ఉంటాయి. కనుక ఎన్నికల హామీలనేవి పులి మీద సవారీ వంటివే.
టీడీపీ ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చింది. కానీ ముందే చెప్పుకున్నట్లు వాటిని అమలుచేయడానికి అపసోపాలు పడుతోంది.
Also Read – జగన్, చంద్రబాబు: ఇద్దరు భక్తుల కధ!
అయితే జగన్ 5 ఏళ్ళ ఆర్ధిక విధ్వంస పాలన గురించి తెలిసినప్పటికీ హామీలు ఇచ్చారు కనుక ఇప్పుడు ఆ కారణం చెప్పి తప్పించుకోవడానికి లేదు. తప్పించుకుంటే కూటమి ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోతుంది.
చంద్రబాబు నాయుడు కంటే తన పాలన చాలా అద్భుతంగా సాగిందని, సంక్షేమ పధకాలకు క్యాలండర్ ప్రకటించి మరీ ఖచ్చితంగా అమలుచేశామని, అందువల్ల తన పాలనలో ప్రజలు సంతోషంగా ఉండేవారని జగన్ వాదనలను పూర్తిగా కొట్టేయలేము.
Also Read – కన్నప్ప తీయడం కూడా శివలీలే!
ఆర్ధిక స్వాతంత్ర్యం లేని మహిళల చేతిలో ఏదో పేరుతో డబ్బు పెడితే వారు చాలా సంతోషిస్తారని కనిపెట్టిన జగన్ ప్రతీ రెండు మూడు నెలలకీ ఏదో పధకం పేరుతో మహిళల చేతిలో డబ్బు పెడుతుండేవారు.
అంతకంటే ఎక్కువే ఇస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికలలో హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. కనుక మహిళలు అసంతృప్తి చెందుతారు. అప్పుడు సంక్షేమ పధకాల విషయంలో జగన్ వాదనలతో వారూ ఏకీభవిస్తారు.
Also Read – మంచి ప్రశ్న వేశారు మద్యలో ఆవు కధ దేనికి భూమనగారు?
కనుక కూటమి ప్రభుత్వం హామీలని ఇంకా వాయిదా వేయలేని పరిస్థితి నెలకొంది. అందుకే ‘అమ్మకు వందనం’, ‘రైతు భరోసా’ హామీలని మే నెల నుంచి అమలుచేస్తామని సిఎం చంద్రబాబు నాయుడు నిన్న శాసనసభలో ప్రకటించారు. అంటే తెలివిగా మరో రెండు నెలలు సమయం తీసుకుంటున్నారన్న మాట!
జగన్ ఎంతో గొప్పగా చెప్పుకునే ‘అమ్మ ఒడి’ పధకాన్ని అమలుచేయలేకనే అనేక ఆంక్షల కత్తెర్లు వేసి, ఒక ఇంట్లో ఒక విద్యార్ధికి మాత్రమే ఏడాదికి రూ.15,000కి బదులు రూ.8-10,000 మాత్రమే చేతిలో పెట్టేవారు.
అదే కష్టమనుకుంటే, కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే అందరికీ రూ.20,000 చొప్పున చెల్లిస్తుందని సిఎం చంద్రబాబు నాయుడు నిన్న శాసనసభలో ప్రకటించారు.
వైసీపీ విమర్శలు భరించలేక లేదా విశ్వసనీయత కోల్పోతామనే భయంతోనో ఈ రెండు పధకాలు అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్దపడుతున్నప్పటికీ, వీటి కోసం ఎక్కడి నుంచి నిధులు సమకూర్చుకుంటారనే సందేహం కలుగక మానదు.
సంపద సృష్టించి సంక్షేమ పధకాలు అమలుచేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు పదేపదే చెప్పారు. కానీ ఇప్పుడు మే నెలలోగా సంపద సృష్టించడం సాధ్యం కాదు. కనుక పూర్తిగా లేదా పాక్షికంగానైనా అప్పులు చేయాల్సి రావచ్చు.
ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేస్తోందని వైసీపీ విమర్షిస్తోంది. ఒకవేళ ఈ రెండు పధకాలు అమలు కోసం కొత్తగా అప్పులు చేస్తే, అప్పుడు జగన్ కూడా సిఎం చంద్రబాబు నాయుడుని వేలెత్తి చూపించి విమర్శించే అవకాశం కల్పించిన్నట్లవుతుంది కదా? అంటే ఎన్నికల హామీల అమలు ఎప్పుడూ పులి మీద సవారి వంటిదేనన్నమాట!