ప్రజాజీవితంలోకి నేటితో చంద్రబాబు నాయుడు 40 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదివరకు ఆయన వద్దన్న ప్రధాని పదవి వస్తే ఏం చెయ్యబోతున్నారు అన్న దానికి చంద్రబాబు నాయుడు సూటిగా సమాధానం చెప్పారు.
“ఆ అవకాశం రాదు వచ్చినా అవసరం లేదు,” అని ఒక్క ముక్కలో తేల్చి పడేశారు ఆయన. చంద్రబాబు వల్ల మోడీ కాస్త అభద్రతా భావానికి గురి అవుతున్నారు అనే ఊహాగానాల మధ్య చంద్రబాబు తన మనసులో మాట బయటపెట్టారు. గతంలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబు మారిన పరిస్థితులకు అనుగుణంగా మారారు అనుకోవచ్చు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి అప్పట్లో 42 ఎంపీ సీట్లు ఉండేవి. ఇక్కడ ఏ పార్టీ గెలిచినా జాతీయ స్థాయి గవర్నమెంట్ లో కీలక భూమిక పోషించేది. అయితే ఇప్పటి పరిస్థితి వేరు. అటువంటి పరిస్థితి రావాలంటే రెండు రాష్ట్రాలలోను తెలుగు దేశమే అధికారంలోకి రావాలి. అది జరిగేది కాదు అని చంద్రబాబు లాంటి రాజకీయ నాయకులకు చెప్పాల్సిన పని లేదు.



