సమాజంలో మహిళలు ఎంత ఎదిగినా… ఇంకో విధంగా చెప్పాలంటే… పురుషుడిపై అన్ని రంగాలలో ఆధిపత్యం కొనసాగించినా… చివరికి వివాహం దగ్గరికి వచ్చే సరికి వరకట్నం చదివించుకోవాల్సిందే. ఈ భారం మోయలేక పసికందుల సమయంలోనే కొందరు చిన్నారులను పొట్టన పెట్టుకుంటున్నారు. అయితే, రాబోయే రోజులన్నీ మహిళా శక్తివేనని ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రసంగించారు.
రాష్ట్రంలో మహిళల జనాభా సగానికి (49.8 శాతంకు) చేరిందని, అయితే క్రమేణా మహిళల సంఖ్య తగ్గుతూ వస్తోందని, రాష్ట్రంలో స్త్రీ, పురుష సమానత్వానికి తమ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కీలక బీజం వేశారని… గుర్తు చేసిన ఏపీ సిఎం, రానున్న కాలంలో అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో ఎదురు కట్నం ఇచ్చే రోజులు రానున్నాయని చంద్రబాబు చెప్పిన రోజుల కోసం మహిళామణుల తల్లితండ్రులు ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. మహిళల శాతం తగ్గిపోవడానికి గల కారణాలలో వరకట్నం ప్రధాన భూమిక పోషిస్తోందని పెరుగుతున్న వరకట్నం కేసుల సంఖ్య చెప్పకనే చెబుతోంది.



