కుప్పంలో అన్నా క్యాంటీన్ ధ్వంసం.. చంద్రబాబు ధర్నా!

chandrababu Naidu Protest at kuppam on roadచిత్తూరు జిల్లాలో కుప్పంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనకు స్థానిక వైసీపీ నేతలు అడుగడగునా అవరోధాలు కల్పిస్తూ ఆయన సహనాన్ని పరీక్షిస్తున్నారు. కుప్పం పట్టణంలో బస్టాండ్ వద్ద టిడిపి ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ను చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించాల్సి ఉండగా దానిని వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేయడంతో టిడిపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.

చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టిడిపి శ్రేణులు స్థానిక ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు టిడిపి శ్రేణులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఆకలితో బాధపడుతున్న పేదప్రజలకు పట్టెడన్నం పెట్టాలనే ఒక సదుద్దేశ్యంతో మనం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే దానిని కూడా అడ్డుకోవాలని వైసీపీ నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటు.

ADVERTISEMENT

ఈ ప్రభుత్వం పేద ప్రజలకి అన్నం పెట్టదు. ఇంకొకళ్ళని పెట్టనీయదు. అన్ని దానాలలోకి అన్నదానం మహాగొప్పది. కనుక అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేద ప్రజల కడుపులు నింపుతున్నారు మనవాళ్ళు. కానీ ఇక్కడ అన్నాక్యాంటీన్ పెట్టబోతుంటే దానిని అడ్డుకొంటారా?మీరు ఎక్కడైతే అడ్డుకొన్నారో మళ్ళీ అక్కడే అన్నా క్యాంటీన్ పెడతాం. ఎవరు అడ్డుకొంటారో నేను చూస్తాను.

ఈసారి నేను పిలుపు ఇస్తే రెండు లక్షల మంది ఇక్కడికి తరలిరావాలని టిడిపి కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తున్నాను. వైసీపీతో తాడోపేడో తేల్చుకొనేందుకే నేను కుప్పం వచ్చాను. ఈసారి మనల్ని ఎవరైనా కొడితే వాడి ఇంటికే వెళ్ళి కాళ్ళుచేతులు విరగొడదాం. ఈ జగన్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని రాక్షసపాలన చేస్తోంది. దానికి ఎలాగూ ఎన్నికలలో ప్రజలు బుద్ది చెపుతారు. వైసీపీ నేతల కనుసన్నలలో పనిచేస్తున్న ఈ పోలీస్ వ్యవస్థను మేము అధికారంలోకి రాగానే సరిచేస్తాను. ఇప్పుడు పోలీస్ శాఖలో ఎవరెవరు అత్యుత్సాహం చూపుతూ మమ్మల్ని వేధిస్తున్నారో వాళ్లందరినీ గుర్తుపెట్టుకొని చర్యలు తీసుకొంటాను,” అని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

స్థానిక వైసీపీ నేతల తీరుపై చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే బస్టాండ్‌ వద్ద రోడ్డుపై బైటాయించి ధర్నాకు దిగారు. ఆయనతో పాటు వందాలదిమంది టిడిపి కార్యకర్తలు రోడ్డుపై బైటాయించి ధర్నా చేయడంతో ప్రస్తుతం కుప్పంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ADVERTISEMENT
Latest Stories