మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయ్యి నేటికీ 38 రోజులైంది. ఆయనని అరెస్టు చేసినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. రెండు రాష్ట్రాలతో సహా దేశవిదేశాలలో కూడా ఆయన అరెస్టుని నిరసిస్తూ ఆందోళనలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మరోపక్క చంద్రబాబు నాయుడుని విడిపించుకొనేందుకు ఆయన తరపు న్యాయవాదులు అంతే కనబడని న్యాయపోరాటాలు చేస్తూనే ఉన్నారు.
జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీలో జాతీయమీడియాకు, చివరాఖరు ప్రయత్నంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి ఏపీలో జగన్ ప్రభుత్వం అరాచకాలను, రాజకీయ వేధింపుల గురించి వివరించారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏవీ ఫలించడం లేదు.
నారా లోకేష్ అమిత్ షాను కలిసి మాట్లాడి అప్పుడే వారం రోజులవుతోంది. కానీ నేటికీ మోడీ, అమిత్ షాలు స్పందించలేదు. ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టులలో చంద్రబాబు నాయుడు కేసులు యధావిధిగా కొనసాగిపోతున్నాయి.
అయితే టిడిపి చేస్తున్న ఈ పోరాటాలతో జగన్ ప్రభుత్వంపై ఎంతో కొంత ఒత్తిడి ఏర్పడింది కనుకనే నారా లోకేష్‌ని అరెస్ట్ చేయడానికి ఇంకా వెనకాడుతోందని అర్దమవుతోంది. కానీ చంద్రబాబు నాయుడు కేసులలో పెద్దగా పురోగతి, మార్పులు కనిపించడం లేదు.
కేంద్ర ప్రభుత్వం వైఖరి, కోర్టు కేసుల తీరుని చూస్తుంటే, చంద్రబాబు నాయుడుకి ఇప్పుడప్పుడే జైలు నుంచి విముక్తి లభించకపోవచ్చని అర్దమవుతోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరేత్తిన్నట్లు వ్యవహరిస్తున్నందున, నేడు కాకపోతే రేపైనా ఏదో ఓ కేసులో నారా లోకేష్, అచ్చన్నాయుడు తదితర టిడిపి ముఖ్య నేతలని, వీలైతే పవన్ కళ్యాణ్‌ని కూడా జైలుకి పంపించి, వారందరూ జైలులో ఉండగానే వైసీపి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు అనుమానం కలుగుతోంది.
ఒకవేళ అదే జరిగితే, వచ్చే ఎన్నికలను వైసీపికి ఏకపక్షంగా మార్చుకోగలదని వేరే చెప్పక్కరలేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడుతో సహా అందరికీ ఈ కేసుల నుంచి విముక్తి లేదా ఉపశమనం లభించిన్నట్లయితే మాత్రం వైసీపి పరిస్థితి ఒక్కసారిగా తారుమారు అవడం తధ్యం.
చంద్రబాబు నాయుడు బయటకు వస్తే వెంటనే ప్రజల మద్యకు వెళ్ళి ఈ కేసులు, తన అరెస్టు గురించి వివరిస్తూ టిడిపికి ప్రజల సానుభూతి సంపాదిస్తారని వేరే చెప్పక్కరలేదు. కనుక చంద్రబాబు నాయుడుకి విముక్తి లభిస్తుందా లేదా?లభిస్తే ఎప్పుడు?అనేది రాష్ట్ర రాజకీయాలను మార్చేయబోతోంది.






