తెలంగాణాలో ‘ఏబీఎన్’ ఛానల్ పై నిషేధం విధించిన సమయంలో… మీడియాపై ఆంక్షలు విధించిన కేసీఆర్ సర్కార్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఉదంతంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా తీవ్రంగా మండిపడ్డారు. అయితే తాజాగా ఏపీలో జగన్ ఛానల్ అయిన సాక్షిపై అనధికార నిషేధం విధించడం తీవ్ర ఒత్తిడిని తీసుకువచ్చింది. అయితే ఎలాంటి సందర్భంలో సాక్షిపై ఈ కఠినతర చర్యలు తీసుకోవాల్సి వచ్చిందనే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుచర వర్గానికి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష చేస్తున్న తరుణంలో… ఈ అవకాశాన్ని వైసీపీకి అనుకూలంగా మలుచుకోవాలని సాక్షి ఛానల్ ద్వారా ఆ సామజిక వర్గాన్ని రెచ్చేగొట్టే విధంగా చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం తిప్పికొట్టే ప్రయత్నంగా, సదరు ఛానల్ ప్రసారాలను నిలుపుదల చేయాల్సి వచ్చిందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా చేస్తున్నారన్న ఉద్దేశంతోనే తాత్కాలికంగా ప్రసారాలను నిలుపుదల చేసామని, ఒక్కసారి ముద్రగడ దీక్ష విరమిస్తే… వెనువెంటనే ప్రసారాలను పునరుద్దరిస్తామని చంద్రబాబు తన అనుచర వర్గానికి చెప్పినట్లుగా సమాచారం.
అంటే సాక్షి ప్రసారాలపై ‘బాల్’ ఇపుడు ముద్రగడ కోర్టులో పడినట్లయ్యింది. అధికారికంగా కాకపోయినా, ఆ నోట ఈ నోట చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు చేరాల్సిన వారికి చేరడం సహజమే. దీంతో సాక్షి ప్రసారాలపై ఒక స్పష్టత వచ్చినట్లయ్యింది.



