ఏపీ సిఎం శనివారం భీమిలి నియోజకవర్గంలో ‘సిద్దం’ సభలో తనను తాను అర్జునుడుతో పోల్చుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నప్పుడే, రాష్ట్రానికి రెండోవైపు ఉరవకొండలో టిడిపి నిర్వహించిన ‘రా… కదిలిరా…’ సభలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చీల్చి చెండాడారు.
భీమిలి సభలో సిఎం జగన్ ప్రసంగిస్తూ “నేను పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిని కాదు… శత్రుమూకలు పన్నిన పద్మవ్యూహాన్ని చేదించగల మహావీరుడు అర్జునుడిని అని గొప్పగా చెప్పుకున్నారు. జగన్ ఈ మాటలు చెప్పుకుంటునప్పుడే, అక్కడ ఉరవకొండలో చంద్రబాబు ప్రసంగిస్తూ, “2021లో ఎవరూ నా వెంట్రుకను కూడా ఎవరూ పీకలేరని జగన్ అన్నారు. 2022లో ప్లీజ్ నన్ను నమ్మండి అంటూ ప్రజలను వేడుకున్నారు. 2023 పూర్తయ్యే సరికి నేను ఎవరినీ నమ్మను అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలను మార్చేసుకున్నారు. 2024 మొదలయ్యే సరికి హ్యాపీగా దిగిపోతాను అని చెప్పుకున్నారు.
అంటే అహంభావంతో పాలన మొదలుపెట్టి ఇప్పుడు తనంతట తానే గద్దె దిగిపోవడానికి సిద్దంగా ఉన్నారంటే, రాబోయే ఎన్నికలలో ఓటమి తప్పదని జగన్ గ్రహించిన్నట్లే ఉన్నారు. ఇది చాలా మంచి మార్పే. అయితే ఆయనేమీ గద్దె దిగక్కరలేదు. ప్రజలే ఆయనను ఎలాగూ దించేస్తారు,” అని అన్నారు.
చంద్రబాబు నాయుడు వ్యంగ్యంగా ఈ మాటలు అన్నప్పటికీ నాలుగేళ్ళలో జగన్ తీరులో వచ్చిన మార్పులని కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు క్లుప్తంగా చాలా చక్కగా చెప్పారు.
వైఎస్ షర్మిలని ఏపీకి రప్పించి తమ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారనే జగన్ ఆరోపణలకు కూడా ఈసభలో చంద్రబాబు నాయుడు చాలా ఘాటుగా జవాబు చెప్పారు.
“అన్నా, చెల్లెలు ఆస్తులు, పదవుల కోసం కీచులాడుకుని ఎప్పుడో విడిపోయారు కదా?జగన్‌తో విభేదించే వైఎస్ షర్మిల తెలంగాణకు వెళ్ళి పార్టీ పెట్టుకున్నారు కదా?జగన్ స్వయంగా తల్లి విజయమ్మని కూడా ఆమె వద్దకే సాగనంపారు కదా? వైఎస్ షర్మిల స్వయంగా మా అన్న జగన్మోహన్ రెడ్డి వల్లనే మా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయిందని చెపుతున్నారు కదా?
అన్నాచెల్లెలు కీచులాడుకుని విడిపోతే దానికి నేను ఎలా బాధ్యుడిని అవుతాను?ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీకి అధ్యక్షురాలుగా వస్తే దాంతో నాకు సంబంధం ఏమిటి?” అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
అయినా ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలీని జగన్ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేశారని, రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటి కంపెనీలు తేలేకపోగా ఉన్నవాటిని కూడా రాష్ట్రం నుంచి తరిమేశాడని, మూడు రాజధానులని చెప్పుకున్న జగన్ కనీసం ఒక్క రాజధాని కూడా ఏర్పాటు చేయలేకపోయిన ప్రగల్భాలకు తక్కువేమీ లేదని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు.
కురుక్షేత్రంలో అర్జునుడు ఉన్నాడు కానీ పద్మవ్యూహంలోకి అభిమన్యుడే వెళ్ళాడు. కానీ జగన్ తనని తాను అర్జునుడుగా ఊహించుకుంటూ కురుక్షేత్రంలో జరగని దానిని జరిగిన్నట్లు భ్రమిస్తూ, ప్రజలను కూడా భ్రమింపజేయాలని ప్రయత్నిస్తున్నారు.
కానీ చంద్రబాబు నాయుడు కళ్లెదుట జరిగిన వాస్తవ పరిణమాలనే ప్రస్తావిస్తూ వాటి ఆధారంగా రాబోయే ఎన్నికలలో జరుగబోయేది ఇదే అని చెపుతున్నారు. వాస్తవానికి, భ్రమకు మద్య ఉన్న ఈ తేడాని అందరూ గ్రహించారు కానీ వైసీపి నేతలు ఇంకా గ్రహించిన్నట్లు లేదు.




