Chandrababu Naidu Telangana Water Politics & BRS vs Congress

ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ రెండు రాష్ట్రాల మద్య నీటి గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఆ పేరుతో ఏపీలో ఎటువంటి రాజకీయాలు జరుగడం లేదు కానీ తెలంగాణలో తరచూ జరుగుతూనే ఉన్నాయి.

తెలంగాణ నీటిని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తరలించుకుపోతుంటే తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నారని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఆయనకు రేవంత్ రెడ్డి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

Also Read – అమరావతికి మరోసారి శంకుస్థాపన?

సమైక్య రాష్ట్రంలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మంజూరు చేసి రూ.35,000 కోట్లతో నిర్మించాలని ప్రతిపాదనలు సిద్దం చేస్తే, కేసీఆర్‌ దాని అంచనాలను రూ.55,000కి పెంచి ఆ డబ్బులు జేబులో వేసుకున్నారే తప్ప ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు.

ఈ ప్రాజెక్టు పూర్తిచేయకపోగా ప్రాజెక్ట్ రీడిజైనింగ్ పేరుతో శ్రీశైలం నుంచి నీళ్ళు తీసుకున్నారని, ఈ నిర్ణయాల వల్లనే మహబూబ్ నగర్‌, రంగారెడ్డి జిల్లాల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Also Read – ఆంధ్ర అంటే ఇంకా నామోషీయేనా కేటీఆర్‌జీ?

పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్‌ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుని పూర్తిచేసి ఉంటే నేడు చంద్రబాబు నాయుడు నీటిని తరలించుకుపొగలిగేవారా?కేసీఆర్‌ని నమ్మి ప్రజలు గెలిపిస్తే జగన్‌తో కుమ్మక్కయ్యి నిలువునా ముంచేశారని ఆరోపించారు.

కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీ నేతల ఈ వాదనలు వింటే వారు ఘర్షణ పడుతున్నది నీళ్ళ కోసం కాదు.. ఆ పేరుతో రాజకీయంగా ప్రత్యర్ధిపై పైచేయి సాధించాలని తాపత్రయపడుతున్నట్లు అర్దమవుతోంది.

Also Read – ఏపీకి పెట్టుబడుల ప్రవాహం… చాలా అవసరమే!

చంద్రబాబు నాయుడుని బూచిగా చూపించి బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి మళ్ళీ బలపడేందుకు ప్రయత్నిస్తుంటే, కేసీఆర్‌ అనాలోచిత నిర్ణయాల వల్లనే మహబూబ్ నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు నీళ్ళు అందడం లేదని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణ రాజకీయాలకు సిఎం చంద్రబాబు నాయుడు దూరంగా ఉన్నప్పటికీ అధికార, ప్రతిపక్షాలు ఈవిదంగా ఆయన పేరుతో రాజకీయాలు చేసుకోవడం విడ్డూరంగా ఉంది కదా?