దేశంలో దాదాపు అన్ని రాజకీయపార్టీలు హుందాతనం ఎప్పుడో కోల్పోయాయి. దేశ, రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా నిలిచి మార్గదర్శనం చేయాల్సిన అధికారపార్టీలు ప్రజలను పార్టీలు, కులమతాల వారీగా విడదీసి వారిలో వారు కొట్టుకొనేలా చేస్తున్నాయి. ఒకప్పుడు యూపీ, బిహార్, తమిళనాడులో కనిపించిన వికృత రాజకీయాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తున్నాయి.
ప్రత్యర్దిపై పైచేయి సాధించడానికి రాజకీయ పార్టీలు ఒక్కో మెట్టు దిగుతుంటే వాటి ప్రత్యర్ధి పార్టీలు కూడా దిగకతప్పడం లేదు. హుందాగా ఉందామనుకొన్నా ఉండనీయని పరిస్థితులు ఒకరికొకరు కల్పించుకొంటున్నారు. ఇందుకు ఉదాహరణగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవచ్చు. ఆయన ఎంత హుందాగా ఉందామన్నా వైసీపీ నేతలు చేస్తున్న తీవ్ర విమర్శలతో ఆయన కూడా తప్పనిసరిగా ఒక మెట్టు దిగి సమాధానం చెప్పవలసి వస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. లేకుంటే రాజకీయాలలో మనుగడ సాగించడం కష్టమైపోతోంది.
ఇంతకీ విషయం ఏమిటంటే, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బుదవారం కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం మండలంలోని కొల్లుపల్లిలో పర్యటించారు. కనుక టిడిపి నేతలు, కార్యకర్తలు తమ అధినేతకు స్వాగతం చెపుతూ దారిపొడవునా జెండాలు, టిడిపి తోరణాలు కట్టారు.
సాధారణంగా ఒక పార్టీ నాయకుడు పర్యటిస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ప్రత్యర్ధి పార్టీ వారు కాస్త వెనక్కు తగ్గి, తమ ప్రత్యర్ధి పార్టీ నాయకుడు సజావుగా పర్యటన పూర్తి చేసుకొని వెళ్ళేందుకు సహకరిస్తుంటారు. ఆ తర్వాత ఆయనపై విమర్శలు, ఆరోపణలు ఎన్నైనా చేయవచ్చు కానీ ఒకరి పర్యటనకు మరొకరు ఆటంకం కలిగించాలనుకోరు.
కానీ వైసీపీ ఈ సత్సాంప్రదాయాన్ని పాటించడం ఎప్పుడో మానుకొంది. మంత్రి జిల్లా పర్యటనకు వస్తుంటే సొంత పార్టీవారే ఆయనకు స్వాగతం చెపుతూ పెట్టిన బ్యానర్లను చించేసుకొనే సాంప్రదాయం కలిగిన వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు వస్తుంటే టిడిపి జెండాలను, తోరణాలను ఉపేక్షిస్తారని ఆశించడం అత్యాసే అవుతుంది. కుప్పంలో నేడు అదే జరిగింది.
టిడిపి కార్యకర్తలు దారిపొడవునా చంద్రబాబు నాయుడుకి స్వాగతం చెపుతూ జెండాలు, తోరణాలు కడితే, వాటిని కనిపించనీయకుండా వైసీపీ కార్యకర్తలు వాటిపై తమ పార్టీ జెండాలు, తోరణాలు కట్టారు. దీంతో టిడిపి కార్యకర్తలు వాటిని తొలగించబోతే వైసీపీ కార్యకర్తలు వారిపై దాడి చేశారు. దీంతో పరస్పరం కర్రలతో దాడులు చేసుకొన్నారు. అప్పుడు పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
దీంతో కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటనలో రసాభాస చేయగలిగామని స్థానిక వైసీపీ నేతలు చాలా సంతోషించి ఉండవచ్చు. వారి ప్రతాపం చూసి సిఎం జగన్మోహన్ రెడ్డి మెచ్చుకొని ఉండవచ్చు. కానీ ప్రజలు మాత్రం అసహ్యించుకొంటున్నారని గుర్తించడం లేదు.



