టిడిపి వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా?

Chandrababu Naidu Volunteers-Andhra-Pradesh-టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నోట రాష్ట్ర ప్రజలు రెండు విషయాలు వినాలని ఎదురుచూస్తున్నారు. 1. బిజెపితో పొత్తులు 2. వాలంటీర్ల వ్యవస్థపై టిడిపి వైఖరి.

ADVERTISEMENT

ఈరోజు అమరావతిలో చంద్రబాబు నాయుడు ఈ రెండు విషయాల గురించి మాట్లాడారు. ఆయనేమన్నారంటే, “బిజెపితో పొత్తుల గురించి ఎవరెవరో మాట్లాడినవాటిపై స్పందించి మాట్లాడి చులకన కాదలచుకోలేదు. రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలే మాకు ముఖ్యం. కనుక వాటి కోసం ఎంత దూరమైన వెళ్తాం. ఎంతవరకైనా పోరాడుతాము. పోరాడితే కేంద్రం దిగివస్తుందనడానికి తమిళనాడులో జల్లికట్టుకు అనుమతించడమే ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల చేర్పులపై మేము ఢిల్లీ వరకు పోరాడేందుకు సిద్దంగా ఉన్నాము,” అని అన్నారు.

వాలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడుతూ, “వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు సేవ చేయడం వరకే పరిమితం కావాలి తప్ప ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరించడం, రాజకీయాలలో పాల్గొనడం సరికాదు. మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము కానీ ప్రజలకు సేవలకే పరిమితం చేస్తాము,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.

బిజెపితో పొత్తులకు తాము వ్యతిరేకం కాదు కానీ ఏపీలో వైసీపీని గద్దె దించి అభివృద్ధి కొరకు సహకరిస్తామని హామీ ఇవ్వాలని చంద్రద్రబాబు నాయుడు కోరుకొంటున్నట్లు అర్దమవుతోంది.

వాలంటీర్ వ్యవస్థని వైసీపీ అవసరాలకి వాడుకోవడం, దాని కోసం వేలకోట్ల ప్రజాధనం వృధా చేస్తుండటం గురించే ఇంతకాలం మీడియా చర్చించింది. కానీ తొలిసారిగా పవన్‌ కళ్యాణ్‌ వాలంటీర్ వ్యవస్థతో జరుగుతున్న అనర్ధాలను బయటపెట్టడంతో ఇప్పుడు అది అవసరమా?అని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు.

వాలంటీర్ల వెనుక వైసీపీ నేతలు నిలబడినప్పటికీ పవన్‌ కళ్యాణ్‌ లేవనెత్తిన ప్రశ్నలతో ప్రజలలో వారు తలెత్తుకొని తిరుగలేకపోతున్నారని చెప్పక తప్పదు. అయితే వైసీపీ చేసిన పాపానికి, అది సృష్టించిన ఈ త్రిశంకు స్వర్గంలో వ్రేలాడుతున్న వాలంటీర్లు బలికావడం సరికాదు. కనుక ప్రభుత్వం మారి టిడిపి అధికారంలోకి వచ్చినా వారి సేవలను ఉపయోగించుకొంటామని నారా లోకేష్‌ కొన్ని నెలల క్రితమే చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే చెపుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories