చంద్రబాబు మధ్యంతర బెయిల్ పైన విడుదలైన వేళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి. అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే… నేడు చంద్రబాబు జైలు నుండి విడుదల అయిన సంఘటనను ; నాడు జగన్ జైలు నుండి విడుదలైన ఘటనతో రాజకీయ విశ్లేషకులు పోల్చడమే.
నిజమే… జగన్ ఏమో ఆర్ధిక నేరస్తుడిగా ఆరోపణలు ఎదుర్కొని, దాదాపుగా 1300 కోట్ల రూపాయలను ఈడీ అటాచ్ చేసి, 16 నెలల పాటు జైలు జీవితం నుండి విడుదల కాగా… సరైన సాక్ష్యాధారాలు లేకుండా, కక్షపూరితంగా 52 రోజుల పాటు జైలు జీవితం గడిపి చంద్రబాబు బయటకు వచ్చారు.
నిజానికి ఈ ఇద్దరి నాయకులకు నేరారోపణలలో గానీ, వ్యక్తిత్వంలో గానీ, వ్యవహారశైలిలో గానీ ఎక్కడా పోలిక లేదు. సరిగ్గా, స్పష్టంగా చెప్పాలంటే… చంద్రబాబుతో పోల్చే స్థాయిలో జగన్ మోహన్ రెడ్డి లేరు. బహుశా భవిష్యత్తులో ఆ స్థాయి పరిధిలోకి వస్తారని కూడా రాజకీయ నిపుణులు భావించడం లేదు.
అయినప్పటికీ నాటి జగన్ విడుదలను – నేటి చంద్రబాబు రిలీజ్ ను విశ్లేషణలు చేస్తున్నారు. అందులో ప్రధానంగా వస్తోన్న మొదటి అంశం… బాడీ లాంగ్వేజ్! తప్పు చేయని ఓ వ్యక్తి నడిచే నడవడికకు, సింపతీతో జనాలను బుట్టలో వేసుకోవాలనుకునే వ్యక్తికి మధ్య వ్యత్యాసమే చంద్రబాబు – జగన్ లు జైలు నుండి బయటకు వచ్చిన ముఖచిత్రాలు.
ఆర్ఆర్ఆర్ పరిభాషలో చెప్పాలంటే… ఏడు పదుల వయసు దాటి 52 రోజుల పాటు జైలులో ఉన్నా, మరోపక్క తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా, వాటిని ప్రజలకు ఏ మాత్రం ప్రదర్శించకుండా, మీ కోసం తాను ఉన్నాననే రాజసం, ఠీవీ చంద్రబాబు నడకలో కనపడుతోందని, మావోడు మాత్రం రెండు భుజాలు కిందకి వదిలేసి, జాలిగా ముఖం పెడుతూ సింపతీ కోసం ప్రయత్నిస్తాడని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.
వీరిద్దరికి విడుదలకు సంబంధించిన మరొక ప్రధానమైన ఘట్టం – జైలు నుండి ప్రయాణం. హైదరాబాద్ లోని చర్లపల్లి జైలు నుండి జగన్ విడుదలైన అనంతరం దాదాపుగా 15 కిలోమీటర్ల మేర అభిమానులు, కార్యకర్తల నడుమ లోటస్ పాండ్ వరకు ప్రయాణం సాగింది. కానీ చంద్రబాబు విడుదల మరింత భావోద్వేగాల నడుమ జరగడంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలను మించిన స్థాయిలో జననీరాజనం పలకడం ఊహించదగిన అంశం కాదు.
రాజమండ్రి నుండి అమరావతికి సాయంత్రం బయలుదేరిన చంద్రబాబుకు అడుగడుగునా సామాన్యుల నుండి ఓ జన ప్రవాహమే వెల్లువెత్తింది. బహుశా దీనిని టీడీపీ వర్గాలు కూడా అంచనా వేసి ఉండకపోవచ్చు. ఆ స్థాయిలో ప్రజలు తమ మద్దతును చంద్రబాబుకు తెలపడం విశేషం. ఓ సినిమా హీరోను చూడడానికి కూడా అన్ని కిలోమీటర్ల పాటు అభిమానం పోటెత్తదు, కానీ చంద్రబాబును స్వయంగా తిలకించడానికి ప్రతి ఊరు నిరీక్షిస్తోందని చెప్పడానికి ఈ ప్రయాణమే ఓ తార్కాణం.
సాధారణంగా రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు జనాలను తరలిస్తుంటారు. ఇది సర్వసహజం. ఇందుకు ఏ రాజకీయ పార్టీ గానీ, ఏ రాజకీయ పార్టీ నేత గానీ మినహాయింపు కాదు. సినీ సెలబ్రిటీలను వీక్షించడానికి మాత్రమే ప్రజలు స్వచ్ఛంధంగా తరలి వస్తారనేది కాదనలేని సత్యం. కానీ నేడు దీనిని చంద్రబాబు అధిగమించి, చరిత్రను సరికొత్తగా లిఖించారని పేర్కొనవచ్చు.
అర్ధరాత్రి సమయంలో కూడా చంద్రబాబుకు ప్రజలు నీరాజనాలు పలకడం చూస్తే టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకోవచ్చు గానీ, అధికార పార్టీ నేతలు మాత్రం గుండెలు చేతితో పట్టుకోవడం ఖాయం. ఈ ప్రభావంతో రాబోయే రెండు, మూడు రోజుల్లో జగన్ ఏ విధంగా ప్రతిస్పందిస్తారో వేచిచూడాలి.
కష్టం వస్తే దానిని అవకాశంగా మార్చుకుని, తన దృఢత్వాన్ని ప్రదర్శిస్తూ, నిబ్బరాన్ని చాటుకునే వ్యక్తి చంద్రబాబు కాగా, తండ్రి అకాల మరణాన్ని మొదలుకొని, బాబాయ్ అగమ్యగోచర చావు వరకు, నడుమ ఉన్న కోడికత్తి నాటకీయ పరిణామాలతో సింపతీతో జనాలను బురిడీ కొట్టించాలనుకునే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డిగా నిలుస్తున్నారనేది రాజకీయ విశ్లేషకులు తేల్చిన అసలు విషయం.




