రాజధాని వస్తే ఆ చుట్టు పక్కల జిల్లాలు అభివృద్ధి చెందుతాయంటే ఎవరైనా అవుననే అంటారు. కానీ రాజధాని వస్తే తప్ప ఆ చుట్టు పక్కల జిల్లాలు అభివృద్ధి చెందవు అంటే ఎవరూ అంగీకరించరు.
రాజధానితో అభివృద్ధి ముడిపడి ఉండటం సహజమే. అమరావతిని వద్దనుకున్న జగన్ 5 ఏళ్ళు అక్కడి నుంచే పాలన చేశారు. కానీ అమరావతి, దాని చుట్టు పక్కల జిల్లాలు ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. ఎందుకంటే ఆయన ప్రాధాన్యత సంక్షేమ పధకాలే తప్ప అభివృద్ధి కాదు కనుక!
కానీ రాజధాని లేకపోయినా పరిశ్రమలు, ఐటి కంపెనీలు తేగలిగితే చాలు ఆ నగరం చుట్టు పక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయని చెప్పేందుకు విశాఖపట్నం నిదర్శనంగా ఉంది.
పరిశ్రమలు, ఐటి కంపెనీలకు వీలులేని వ్యవసాయ ఆధారిత జిల్లాలకు సాగునీరు అందించి వ్యవసాయానికి తోడ్పడినా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనడానికి కృష్ణ, గోదావరి జిల్లాలే నిదర్శనం.
‘మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం’ అని వితండావాదం చేసిన జగన్ వాటిని ఏర్పాటు చేసి తన వాదనలు నిజమని నిరూపించకపోగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, వ్యవస్థలన్నిటినీ భ్రష్టు పట్టించేసి, రాష్ట్ర ప్రతిష్టని చివరికి రాష్ట్ర విశ్వసనీయతని కూడా దెబ్బ తీశారు.
అందుకే రాష్ట్ర విభజన కంటే ఐదేళ్ళ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం కలిగిందని సిఎం చంద్రబాబు నాయుడు పదేపదే చెపుతుంటారు.
రాష్ట్రం అభివృద్ధి చెందితే, అందరికీ ఉద్యోగాలు, ఉపాది వాటితో ఆదాయం లభిస్తేనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి.
కానీ ‘సంక్షేమ పధకాల పేరుతో డబ్బులు పంచిపెడితే చాలు.. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి… పెరిగితే రాష్ట్రం అభివృద్ధి చెందిన్నట్లే’ అని జగన్ రివర్స్ ఫార్ములా కనిపెట్టి అమలుచేశారు.
కానీ అభివృద్ధి అంటే ఏమిటో సిఎం చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రజలకు రుచి చూపిస్తున్నారు. ‘న్యాయరాజధాని వస్తే చాలు సీమ జిల్లాలు వాటంతట అవే అభివృద్ధి చెందిపోతాయని’ జగన్ నమ్మబలికేవారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు ఏనాడూ అటువంటి పిచ్చి ప్రేలాపనలు చేయరు.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి సన్నాహాలు చేయిస్తున్నారు. జిల్లాలోని ఓర్వకల్లులో అనేక పరిశ్రమలు ఏర్పాటుకి రంగం సిద్దం చేస్తున్నారు.
కడప, అన్నమ్మయ్య జిల్లాల మద్య అదానీ గ్రూప్ రూ.8,240 కోట్లు పెట్టుబడితో ‘ఆస్తా గ్రీన్ ఎనర్జీ’ పేరుతో 1,000 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. ఈ ఒక్క ప్లాంట్ ద్వారా వేల మందికి ఉద్యోగాలు, ఉపాధి లభించబోతున్నాయి.
కడప, నంద్యాల జిల్లాల మద్య దేశంలోనే తొలిసారిగా సోలార్ మరియు విండ్ మిల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుని నిలువ చేసే బ్యాటరీ స్టోరేజ్ ఇంటిగ్రేటడ్ ప్రాజెక్టుకి నిన్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు.
విండ్ మిల్స్ ద్వారా 119 మెగావాట్స్, సోలార్ ప్యానల్స్ ద్వారా 130 మెగావాట్స్ విద్యుత్ నిలువ చేయగల బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘హీరో’కు చెందిన గ్రీన్ టెక్ సంస్థ ఈ హైబ్రీడ్ ఇంటిగ్రేటడ్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. దీని ద్వారా కడప, నంద్యాల జిల్లాలలో వేల మందికి ఉద్యోగాలు, ఉపాధి లభించనున్నాయి.
అంటే జగన్ ప్రజలందరూ ఎప్పటికీ ప్రభుత్వంపై ఆధారపడి ఉండేలా చేసుకొని వారిని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనుకుంటే, చంద్రబాబు నాయుడు ప్రజలు ఎవరి కాళ్ళపై వారు నిలబడి సంపాదించుకొని ఆత్మగౌరవంతో బ్రతికేలా చేస్తున్నారని అర్దమవుతూనే ఉంది కదా? వీరిద్దరిలో ఎవరు కరెక్ట్?




