పార్టీ ఏదైనా సరే కొంతమంది నాయకుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఆ కీలక పాత్రధారుల నిర్ణయాలు,ఆలోచనలు ,సలహాలు పార్టీ మనుగడకు మరియు కార్యకర్తల్లో మరో ధైర్యాన్ని నింపడానికి ఉపయోగపడతాయి. మరి అలాంటి కీలకనేతలే పార్టీకి దూరం అయ్యే పరిస్థితి వస్తే.. ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోద్ది. మిగిలిన నేతల్లో ఆందోళన మొదలవుద్ది. సరిగ్గా అలాంటి పరిస్థితే ఆ పార్టీకి ఎదురయ్యిందనే విమర్శలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా వైసీపీ సాధించిన ఘనవిజయం గురించి చర్చ ఓ రేంజ్ లో జరిగింది. అయితే ఆ విజయం వల్ల వచ్చిన గర్వమో లేక కొన్ని వర్గాల స్థిరమైన ఓటు బ్యాంక్ తమకే ఉందన్న ధీమానో కానీ, ఆ విజయం కాస్త మూడు నాళ్ళ ముచ్చటగా మారిన పరిస్థితులు వచ్చాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.
అలాంటి విమర్శలు వినబడడానికి కారణం ప్రస్తుతం వైసీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ పై అభిమానంతో జగన్ వెంట నడిచిన నేతలంతా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారని, జగన్ తీరుతో విసిగిపోతున్నారని, వారికి ఇష్టం లేకపోయినా ప్రతిపక్ష టీడీపీ పై విమర్శనాస్త్రాలు గుప్పించాలని, అలా చేయకుంటే తమకున్న బెర్త్ (పదవి) బర్త్ రఫ్ అయ్యినట్లేననే బాధే నేతల్లో ఎక్కువగా కనిపిస్తుందనే చర్చ కూడా జరుగుతుంది.
వైసీపీలో అత్యంత కీలకమైన నేతల్లో ఒకరు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. చంద్రబాబు, లోకేష్ లపై ఆయన విరుచుకుపడ్డ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్విట్టర్ వేదికగా కూడా చంద్రబాబు పై ఆయన చేసిన విమర్శలు బహుశా తెలుగు ప్రజలు అంత సులువుగా మర్చిపోరేమో. కానీ ప్రస్తుతం ఆయన ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారనే టాక్ బాగా ప్రచారంలో ఉంది.
విజయసాయి రెడ్డి గతంలో లాగా బాబు, లోకేష్ లపై ఆయన విమర్శలు చేయడం లేదు సరికదా, అసలు విమర్శించడానికే ససేమిరా అంటున్నారట. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఆయన అంతగా ఆసక్తి చూపడం లేదనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఏంటి ఆయనలో ఇంతమార్పు అనే చర్చ జరగడం ప్రారంభమయ్యింది. సమాధానం కోసం వేచిచూస్తున్న వారికి అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.
తారకరత్న కార్డియాక్ అరెస్ట్ కి గురి అయిన తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయం నుండి మరణించిన అనంతరం పెద్ద ఖర్మ అయ్యే వరకు చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులతో విజయసాయి రెడ్డి దగ్గరగా ఉండటం, వారి మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలను స్వయంగా చూడటంతో ఆయన విస్తుపోయారని, బాబు బాలయ్య లపై నిత్యం వచ్చే విమర్శలకు, వారి నిజ స్వభావానికి చాలా తేడా ఉందని ఆయనకు అర్ధమయ్యిందని కొలికపూడి మీడియా ముఖంగా వ్యాఖ్యలు చేశారు.
అప్పటి నుండి చంద్రబాబు ని విమర్శించడానికి విజయసాయి రెడ్డి అస్సలు ఇష్టపడటం లేదని, పైగా ఆ కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని కొలికపూడి అన్నారు. అంతేకాకుండా విజయసాయి రెడ్డికి ఆయన కుటుంబంతో జరిగిన ఒక ఆసక్తికర సంభాషణను కూడా బయట పెట్టారు.
చంద్రబాబు, బాలయ్య మనస్థత్వం దగ్గర నుండి చూశాక వారిని విమర్శించడం కరెక్ట్ కాదని, ఒకవేళ విమర్శలు చెయ్యాల్సివస్తే అలాంటి రాజకీయాలే మనకు వద్దు అని విజయసాయి రెడ్డితో ఆయన కుటుంబ సభ్యులు చెప్పారని కొలికపూడి వెల్లడించారు. అందుకే విజయసాయి రెడ్డి మౌనంగా ఉంటున్నారని, అవసరమైతే టీడీపీ లోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
ఒక పక్క కోటంరెడ్డి, ఆనం, మేకపాటిల తిరుబాటు, మరోపక్క పెద్దిరెడ్డి మౌనం, ఇంకో పక్క బాలినేని అలక, అన్నింటికి మించి ప్రస్తుతం విజయసాయి రెడ్డి అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న తీరుతో వైసీపీ శ్రేణుల్లో ఓటమి భయం పెట్టుకుందనే విమర్శలు చక్కర్లు కొడుతున్నాయి.
విజయసాయి రెడ్డి నిజంగా మనసు మార్చుకోవడం జరిగితే గిరా గిరా తిరుగుతున్న ఫ్యానులో ఒక రెక్క ఊడినట్లే అనే మాటలు సామాన్యుల నుండే వస్తున్న పరిస్థితి నెలకొంది



