రాజధాని రైతులు అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి వరకు చేయబోయే మహా పాదయాత్రకు అనుమతించకుండా అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైంది. దాంతో ఉక్రోషం పట్టలేక మంత్రి గుడివాడ అమర్నాథ్ ద్వారా రైతులపై, చంద్రబాబు నాయుడుపై విషం కక్కింది.
“మా ప్రభుత్వం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా అభివృద్ధి చేద్దామనుకొంటే చంద్రబాబు నాయుడు రాజధాని రైతులను రెచ్చగొట్టి ఈ మహాపాదయాత్ర చేయిస్తున్నారు. కనుక విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయవద్దని, విశాఖ అభివృద్ధి కంటే అమరావతి అభివృద్ధే ముఖ్యమని చంద్రబాబు నాయుడు, స్థానిక టిడిపి నేతలు ప్రకటించగలరా?” అని మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్ర విభజనతోనే రెండుగా విడిపోయిన తెలుగు ప్రజలను మళ్ళీ వైసీపీ ప్రభుత్వం తన ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈవిదంగా ప్రాంతాలు, కులమతాల పేరుతో చిచ్చు రగిలించి విడదీయాలనుకోవడం చాలా శోచనీయమే.
దీనికి టిడిపి నేత చింతమనేని ప్రభాకర్ ధీటుగా సమాధానం చెప్పారు. ఈరోజు అమరావతిలోని వెంకటపాలెంలో రైతుల మహా పాదయాత్ర ప్రారంభ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “అమరావతి వద్దు మూడు రాజధానులే ముద్దు అంటున్న వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేసి అదే నినాదంతో ఎన్నికలకు వెళ్ళగలదా? అప్పుడు ప్రజలే తేల్చుకొంటారు వారికి అమరావతే కావాలో మూడు రాజధానులు కావాలో? టిడిపి కావాలో వైసీపీ కావాలో… “ అని అన్నారు.
అయితే వైసీపీ ఇప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికలలో తప్పకుండా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాల్సి ఉంటుంది. ఒకవేళ జగన్ మళ్ళీ మడమ తిప్పకుండా మూడు రాజధానులకే కట్టుబడి ఉండి అదే విషయం ప్రజలకు చెప్పి మళ్ళీ అధికారంలోకి రాగలిగితే అప్పుడు ఈ వాదనలు ఉండవు… ఈ ఆందోళనలు, మహా పాదయాత్రలు కూడా ఉండవు. కనుక వైసీపీకి ఈ సవాల్ స్వీకరించే దమ్ముందా?



