చంద్రబాబుపై దండయాత్ర… ఏం జరుగుతోంది..?

Chintamaneni-Prabhakar Raises voice against TDPఏపీలో మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం లభించకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతలు ఇప్పటికే తమ ఎమ్మెల్యే పదవులకు సైతం రాజీనామా చేస్తామని ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు మంత్రి పదవి దక్కడంపై దెందూలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్గీయులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టిన వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ… తన పదవికి రాజీనామా చేస్తానని, అయితే వేరే పార్టీల్లో చేరే ప్రసక్తే లేదని, అవసరమైతే కొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తానని, పార్టీలు మారి కార్యకర్తలను అవమానించలేనని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగాలని తాను అనుకోవడం లేదని, సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తన రాజీనామా లేఖను అందజేయాలని అనుకుంటున్నానని చింతమనేని అన్నారు. ఇలా పార్టీలో అసంతృప్త వాదుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది.

ADVERTISEMENT

తాజాగా గుంటూరు జిల్లా నేత, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ కూడా రాజీనామాకు పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎంతో కాలంగా తనకు మంత్రి పదవిని ఇస్తామని చెబుతూ వస్తున్న పార్టీ, చివరకు మొండిచెయ్యి చూపడంపై మనస్తాపంతో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అలకబూనిన విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, గన్ మెన్ లను వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే ఆలోచనలో బండారు ఉన్నట్టు సమాచారం.

ఇక సీనియర్ ఎమ్మెల్యే అయినప్పటికీ తన తండ్రి గౌతు శివాజీకి పదవి ఇవ్వలేదని ఆరోపిస్తూ, శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని శిరీష నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, మంత్రి పదవిని కోల్పోయి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు మూడు సార్లు ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. విస్తరణకు కారణాలను, బొజ్జలను ఎందుకు తీసేయాల్సి వచ్చిందన్న అంశాలను వివరించి, రాజీనామాను వెనక్కు తీసుకోవాలని కోరారు.

ఈ జాబితాలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమా కూడా చేరారు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదన్న అసంతృప్తితో, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమంటూ, కార్యకర్తలతో సమావేశమై, తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధపడ్డ బొండా ఉమా, చివరకు వెనక్కి తగ్గారు. ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు ఉమ ఇంటికి వెళ్లి బుజ్జగించడంతో సర్దుకున్నట్టు తెలుస్తోంది. ఆపై ఉమను వెంటబెట్టుకుని ముగ్గురు నేతలు సీఎం ఇంటికి వెళ్లారు.

ADVERTISEMENT
Latest Stories