మెగాస్టార్ చిరంజీవి ఇటీవల జగన్ ప్రభుత్వం మీద చేసిన విమర్శలకు మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే సమాధానం ఇచ్చారు. చిరంజీవి చెప్పిన్నట్లుగానే జగన్ ప్రభుత్వం ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’ కూడా ప్రయోగించింది. చిరంజీవి తాజా చిత్రం భోళాశంకర్ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కనుక భోళాశంకర్ సినిమాకు మొదటి పది రోజులు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతించాలంటూ సదరు సినీ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొంది.
కానీ సినీ నియంత్రణ చట్టం ప్రకారం ఏపీలో 20 శాతం షూటింగ్ చేసినట్లు, హీరోహీరోయిన్ల పారితోషికం కాకుండా సినిమా నిర్మాణానికి రూ.100 కోట్లు ఖర్చు పెట్టిన్నట్లు నిరూపించే పత్రాలను దరఖాస్తుతో జత చేయనందున అనుమతి నిరాకరిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. అన్ని వివరాలతో మళ్ళీ దరఖాస్తు చేసుకొంటే పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నట్లయితే టికెట్ ధరలు పెంచుకొనే విషయం పరిశీలిస్తామని తెలియజేసింది.
చిరంజీవికి ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి తెలుసు. రాజకీయాల గురించి మాట్లాడితే ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతాయని తెలుసు. కనుక రాజకీయాల గురించి మాట్లాడరు. కానీ మొన్న వాల్తేర్ వీరయ్య సినిమా ఫంక్షన్‌లో హీరోల పారితోషికం గురించి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంటులో ప్రస్తావించడంపై స్పందిస్తూ, “ఇదేమైనా జాతీయసమస్యా? పార్లమెంటులో చర్చించడానికి?మా వల్ల సినిమాలు ఆడుతున్నాయి కనుకనే నిర్మాతలు మాతో సినిమాలు తీస్తున్నారు. ఆ సినిమాలపైనే వేలాదిమంది ఆధారపడి జీవిస్తున్నారు. ఆ సినిమాలతోనే పన్నుల రూపంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. ఆ సినిమాలతోనే మేము ప్రజలను రంజింపజేస్తున్నాము. అయినా మీరు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం సంధించిన్నట్లు మా సినిమా పరిశ్రమపై ఎందుకు పడుతున్నారు?జగన్ ప్రభుత్వం సినీ పరిశ్రమ మీద పడే బదులు ఏపీలో రోడ్లు, అభివృద్ధి, ప్రత్యేకహోదా గురించి ఆలోచిస్తే బాగుంటుందని చిరంజీవి చిన్న చురకలు వేశారు.
సరిగ్గా భోళాశంకర్ విడుదలకు ముందు చిరంజీవి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే ఇందుకు కారణమని అర్దమవుతూనే ఉంది. కానీ అందరూ ఈవిదంగా తమ ప్రభుత్వాన్నే ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారు?అందరినీ శత్రువులుగా మార్చుకొని అందరిపై కక్ష సాధిస్తుంటే చివరికి ఏమవుతుంది?ఈవిదంగా వ్యవహరిస్తుంటే రాష్ట్ర ప్రజలు తమ గురించి ఏమనుకొంటారు?అని వైసీపీ నేతలు ఎవరూ ఆలోచిస్తున్నట్లు లేదు.
ఒకవేళ ఈ విషయం గ్రహించినా పిల్లి మెడలో గంటెవరు కడతారన్నట్లు వైసీపీలో అందరూ తమ అధినేతకు తానతందాన పాడుతున్నట్లు భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే వారికి వేరే దారి లేదు కనుక… ఏ దారీ లేకుండా వారి నోటితోనే మూయించేశారు కనుక! మునిగినా తేలినా అంతా అధినేతతోనే కనుక. ఆయన కోసం నోరు పెట్టుకొని బ్రతికేయాల్సిందే… తప్పదు.



