“ఇల్లు తగలబడిపోతోంది అని ఒకడు ఏడుస్తుంటే… చుట్ట అంటించుకోవడానికి నిప్పు కావాలన్నాడంటా మరొకడు…” అలా ఉంది రాష్ట్ర పరిస్థితి. దేవుడో… రాముడో… అంటూ రాష్ట్రాన్ని ఈదుతున్న ముఖ్యమంత్రికి ‘కాపు రిజర్వేషన్ల’ రూపంలో ముద్రగడ పద్మనాభం సెగ తగిలింది. దానికి తోడు ఎన్నికల హామీలలో ఈ అంశం ఒకటి కావడంతో, ప్రభుత్వంపై మరింత ఒత్తిడి ఏర్పడింది. నిజమే… ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. అందులో భాగంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి 1000 కోట్లు ఇచ్చి, ఆ దిశగా ఒక కార్యాచరణ రూపకల్పన చేసాము… ఇది ప్రభుత్వం చెప్తున్న మాట.
మరో వైపు నుండి ముద్రగడ మాత్రం… ఉన్న పళంగా తమ డిమాండ్లను పరిష్కరించాలి. అప్పుడే తమ జాతికి న్యాయం జరుగుతుంది అంటున్నారు. ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్న ముద్రగడ దీక్ష కొనసాగిస్తున్నారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితులు విషమించుతున్న నేపధ్యంలో… ఈ అంశాన్ని మరింత రాజకీయం చేసేందుకు రంగంలోకి దిగారు పలువురు ప్రముఖులు. కాంగ్రెస్ పార్టీ నుండి మెగాస్టార్ చిరంజీవి, పల్లంరాజు, వైసీపీ నుండి బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు తదితరులు, ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేని మాజీ కాంగ్రెస్ నేత, భవిష్యత్తు వైసీపీ నేతగా భావిస్తున్నటువంటి దాసరి నారాయణరావులు కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు.
ముద్రగడ చేస్తున్న ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ, ఒకవేళ ముద్రగడ ఆరోగ్యానికి ఏమైనా జరిగితే విషమ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ప్రభుత్వానికి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎన్నికల వేళ మీ పార్టీ మ్యానిఫెస్టోలో ఉన్న అంశమే మేము డిమాండ్ చేస్తున్నది అంటూ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసారు. ఒక్క మాటలో చెప్పాలంటే… ప్రస్తుతం ప్రశాంతంగా సాగుతున్న ‘కాపు ఉద్యమం’లో కులం, జాతి పేర్లు చెప్పి ఆ సామాజిక వర్గపు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసారు సదరు ప్రముఖులంతా! అయితే సందర్భం కాకపోయినప్పటికీ సదరు నేతలలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో తెలియజేయడానికి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్ళాల్సిందే..!
ఒక కులం ఎదుగుదల కోసం, ఒక జాతి అభివృద్ధి కోసం అంటూ ఏకమైన ఈ అతిరధ మేధావి వర్గమంతా, రాష్ట్ర విభజన సమయంలో ఎందుకు ఏకం కాలేదన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచనలకు ఎవరు సమాధానం చెప్తారు? ఆనాడు అవినీతి వైసీపీతో కలిసేది లేదు అంటూ చిరంజీవి, పల్లంరాజు వంటి వారు వ్యాఖ్యానించగా, అసలు విభజనకు కారణమైన కాంగ్రెస్ నేతలతో కలిసేది లేదు అంటూ వైసీపీ అధినేత జగన్ తో సహా ప్రస్తుతం మీడియా ముందు ఆవేదన వినిపించిన అంబటి రాంబాబు తదితరులు కూడా వ్యాఖ్యలు చేసారు. అంటే ఒక కులం కోసం అయితే ఈ మేధావి వర్గమంతా ఏకం అవుతారు గానీ, ఒక రాష్ట్ర సంక్షేమం కోసం అయితే ఎవరికీ పట్టనట్టు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలను పక్కదోవ పట్టిస్తారు.
ఇలాంటి నేతలంతా ఆంధ్రప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహించడం… ఏపీ ప్రజల దౌర్భాగ్యంగానే భావించాలి. నిజంగా రాష్ట్రం కోసం పోరాడాలి అన్న చిత్తశుద్ధి ఇప్పటికైనా ఉంటే, కేంద్రం నుండి నిధులు ఎందుకు రావడం లేదు అంటూ… అంతా ఏకమై ప్రభుత్వాన్ని కూడా కదలాలి అంటూ విమర్శలు చేయాలి. అప్పుడు ప్రజలంతా హర్షించేవారు, వారు ఎన్ని విమర్శలు చేసినా సమర్ధించేవారు. కుల రాజకీయాల కోసం ఏకమైన ఈ మేధావి వర్గమంతా రేపు నిజంగా రాష్ట్ర శ్రేయస్సు కోసం ఒక్కటై కదలాలి అంటే… అప్పుడు గుర్తుకు వస్తుంది… బొత్స గారు అవినీతి పార్టీకి చెందిన వారు అని… అలాగే విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత చిరంజీవి అని..!
ఒక లక్ష్యం కోసం పోరాటం చేయడంలో తప్పు లేదు, అయితే స్వార్ధపూరితమైన ఒక్క లక్ష్యమే నిర్దేశించుకోవడం ఖచ్చితంగా విమర్శల పాలయ్యేదే. సమయం, సందర్భం లేని ఉద్యమాలకు మద్దతు పలికే నాయకులు, రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టే సిగ్గుమాలిన నేతలు ఏపీలోనే ఉన్నారని… రాష్ట్ర విభజన సమయంలో ప్రజలకు కళ్ళకు కట్టినట్లుగా కనపడింది. మరోసారి అలాంటి చరిత్రనే పునరావృతం చేసే విధంగా ‘చిరంజీవి అండ్ కో’ నిరూపించే క్రమంలో ఉన్నట్లుగా కనపడుతోంది.



