చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఎంతో ఆర్భాటంగా ఆరంభమయ్యి అంతే తొందరగా కాలగర్భంలో కలిసిపోయింది. జెండా పీకేశారు అనే అపప్రధ మాత్రం చిరంజీవి కుటుంబానికి మిగిలింది. ఆ మచ్చ పోగొట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ చాలానే కష్టపడ్డారు. అన్న మీద గౌరవం ఉందని చెబుతూనే ఆయనను దూరం పెట్టారు.
జనసేన ప్రజారాజ్యం ఒకటే అనే అభిప్రాయం ప్రజలలో వస్తే రాజకీయంగా కష్టమని ఆయన భావించడమే అందుకు కారణం. అయితే పార్టీలో ప్రజారాజ్యం వాసనలు పెరుగుతున్నాయట. అప్పుడు ప్రజారాజ్యంలో కలిసి పని చేసిన నేతలు ఒక్కొకరుగా వచ్చి చేరుతున్నారట. అంతే కాకుండా మెగా అభిమానసంఘాలకు ఇటీవలే వచ్చిన కొన్ని మెస్సేజిలు కూడా దీనినే సూచిస్తున్నాయి.
చిరంజీవి అభిమాన సంఘాలలో అత్యంత పెద్దది, చురుకైనది అయిన అల్ ఇండియా చిరంజీవి యువత సభ్యులందరికి గతంలో ప్రజారాజ్యానికి పని చేసినట్టే ఇప్పుడు జనసేనకు కూడా పని చెయ్యాలని చెప్పారట. ఆ సంఘంలో ఏం జరిగినా చిరంజీవికి తెలియకుండా జరగదు. అంటే చిరంజీవి తెరవెనుక నుండి జనసేనను నడిపిస్తున్నారా అనే అనుమానం రాక మానదు.



