వైసీపీ భయాలు నిజమయ్యాయి… ఇంతకాలంగా ఏది జరగకూడదనుకొంటోందో సరిగ్గా అదే జరిగింది.. టిడిపి, జనసేనల మద్య విభేధాలు సృష్టించి వాటిని దూరంగా ఉంచడానికి చేసిన విశ్వప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నిజం చెప్పాలంటే దాని ప్రయత్నాలే ఆ రెండు పార్టీలను కలిపాయని చెప్పవచ్చు. అంటే మరో స్వయంకృతాపరాధామన్న మాట! వైసీపీ వ్యూహం బ్యాక్ ఫైర్ అయిందన్న మాట!
విజయవాడ నోవాటెల్ హోటల్‌లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తదితరులు నిన్న సమావేశమైన తర్వాత ఇద్దరూ కలిసి సంయుక్త ప్రకటన చేశారు.
దాని సారాంశం ఏమిటంటే, “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఖూనీ చేస్తోంది. కనుక దానిని కాపాడుకోవడం కోసం ఇక నుంచి టిడిపి, జనసేనలు కలిసి పనిచేయాలని నిర్ణయించాము. ఓట్లు, సీట్లు, ఎన్నికలు, పోటీ గురించి మాట్లాడుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. కనుక వాటి గురించి తర్వాత మాట్లాడుకొందామని నిర్ణయించుకొన్నాము. ముందు పార్టీలను, ప్రజాసామ్యాన్ని కాపాడుకోవడమే మా తక్షణ కర్తవ్యం. కనుక రెండు పార్టీలు కలిసి పనిచేస్తూ ప్రజల మద్యకు వెళ్ళాలని నిర్ణయించుకొన్నాము. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు కలిసి వచ్చే పార్టీలన్నిటిని కలుపుకుపోవాలని నిర్ణయించాము,” అని చెప్పారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువైపోయాయి. పాలన ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను మానసికంగా, శారీరికంగా వేదిస్తూ సిఎం జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం అనుభవిస్తున్నారు. వైసీపీ నేతలు చివరికి ప్రజలను, మహిళలను కూడా కించపరుస్తున్నారు. ప్రతిపక్ష నేతలను వ్యక్తిగతంగా దూషిస్తూ, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి మానసికంగా క్రుంగిపోయేలా చేసి రాజకీయంగా పైచేయి సాధించాలని వికృత రాజకీయాలు చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోలేము. విశాఖలో పవన్ కళ్యాణ్‌ను పోలీసులతో ఏవిదంగా వేధించిందో అందరూ చూశారు. పవన్ కళ్యాణ్ అంతటివాడినే ఇంతగా వేధించినప్పుడు తమ పరిస్థితి ఏమిటని ప్రతీ ఒక్కరూ భయపడేలా చేయడమే వైసీపీ ఉద్దేశ్యమని అర్దమవుతూనే ఉంది. ఈవిదంగా ప్రతిపక్షాలను, ప్రజలను భయపెడుతూ వైసీపీ అధికారం చలాయించాలని చూస్తోంది.
ఇటువంటి పరిస్థితులలో కూడా ఇంకా మేము చేతులు కలిపి పోరాడలేకపోతే మాతో కలిసి పోరాడేందుకు ప్రజలు కూడా వెనుకంజవేస్తారు. కనుక కలిసివచ్చే పార్టీలను కలుపుకొని అందరం కలిసి పనిచేస్తూ ప్రజలకు ప్రజస్వామ్యంపై నమ్మకం, భరోసా కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది,” అంటూ చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని, అరాచకాలను తీవ్రంగా ఎండగట్టారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ప్రజల తరపున మాట్లాడేవారిని వైసీపీ ప్రభుత్వం గొంతు నొక్కి అణచివేయాలని ప్రయత్నిస్తోంది. మా పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైళ్ళలో పెట్టి వేదిస్తోంది. ఓ పక్క రాష్ట్రంలో బిజెపి నేతలను, కార్యకర్తలను కూడా వేధిస్తూనే, సిఎం జగన్ ఢిల్లీ పెద్దలకు తిరుపతి లడ్డూలు ఇచ్చి ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేస్తుంటారు. కనుక రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను వైసీపీ నుంచి కాపాడుకొనేందుకు బిజెపితో సహా సీపీఐ, సీపీఎం, టిడిపి తదితర అన్ని పార్టీలు కలిసి పోరాడక తప్పదు. వైసీపీని ఎదుర్కోవడానికి ఎప్పటికప్పుడు మా పోరాట వ్యూహాలను మార్చుకొంటూ ముందుకు సాగుతాము. అవసరమైతే మేము పదిసార్లు మాట్లాడుకొని కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగుతాము తప్ప వైసీపీ బెదిరింపులకి భయపడే ప్రసక్తే లేదు,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.



