వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరైన నేపధ్యంలో… భూమనను అరెస్ట్ చేస్తారని ఊహించుకున్న వైసీపీ నేతలు సీఐడీ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి పూనుకున్నారు. వీరి ప్రణాళికలను పసిగట్టిన పోలీసు వర్గాలు, ‘చెవిరెడ్డి అండ్ కో’ను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. అప్పటికి భూమన ఇంకా విచారణలోనే ఉండడంతో, కరుణాకరరెడ్డి అరెస్ట్ తప్పదన్న వార్తలతో జగన్ మీడియా సందడి చేసింది. మరో రకంగా చెప్పాలంటే… భూమన అరెస్ట్ పై అధికారిక వార్తల కోసం వైసీపీ వర్గం తీవ్రంగా ఎదురుచూసినట్లయ్యింది.
కానీ, ఏడు గంటల సుదీర్ఘ విచారణ అనంతరం భూమన కరుణాకరరెడ్డి గుంటూరు సీఐడీ కార్యాలయం నుండి బయటకు రావడంతో వైసీపీ వర్గాలు అవాక్కైనట్లయ్యింది. భూమనను అరెస్ట్ చేస్తారేమో, ప్రభుత్వంపై విరుచుకు పడదామని భావించిన వైసీపీ వర్గాలకు షాక్ తగలగా, బయటకు వచ్చిన భూమన మాత్రం తనదైన స్టైల్ లో ఏపీ సర్కార్ పై మండిపడ్డారు. “తనను తుని కేసులో ఇరికించడానికి చంద్రబాబు సర్కార్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని, సీఐడీ అధికారులు ఎప్పుడు పిలిచినా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని” అన్నారు.
భూమన వ్యాఖ్యలను పరిశీలిస్తే… మళ్ళీ సీఐడీ విచారణ తప్పకపోవచ్చన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. బహుశా మరిన్ని ఆధారాలు లభ్యమైన తర్వాత వైసీపీ వర్గాలు ఆశించిన కార్యం జరగొచ్చని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే నిజంగా వైసీపీ ఆరోపిస్తున్నట్లు… ఈ కేసులో వైసీపీ నేతలను ఏపీ సర్కార్ ఇరికించాలంటే, ఇన్ని సార్లు విచారణ చేయాలంటారా? అధికారం చేతిలో ఉంటే ఏం చేయవచ్చో, ఎంత చేయవచ్చో అనేది వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ చేసి చూపించిన విషయం బహిరంగమే.
మరి అదే విధానాలను చంద్రబాబు కూడా అవలంభిస్తే… వైసీపీ నేతలకు ఈ విచారణ కూడా అనవసరమేమో? అన్న ప్రశ్నలు తలెత్తకమానవు. చేతిలో ఉన్న మీడియాతో ప్రజలలో భావోద్వేగాలను రగిల్చి, తద్వారా రాజకీయ లబ్ది పొందాలనే లక్ష్యం తప్ప, వైసీపీ వర్గాలకు మరొకటి తెలియవన్నది ఈ సందర్భంగా మరోసారి రుజువు చేసారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



