చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే 50 రోజులు పూర్తయింది. క్రికెట్ భాషలో ‘హాఫ్ సెంచరీ’ అనుకోవచ్చు. ఈ నెలన్నర రోజుల చంద్రబాబు నాయుడు పాలన ఏవిదంగా ఉంది?అని ప్రశ్నిస్తే జగన్ & కో ‘జీరో మార్కులు’ వేసి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నారు కూడా.
జగన్ 5 ఏళ్ళ పాలనకు ప్రజలు జీరో మార్కులు వేయడం వలననే 175 అనుకుంటే 11 సీట్లే ఇచ్చారనే విషయం గ్రహించలేదు. గ్రహించినా అంగీకరించడానికి అహం అడ్డొస్తోంది. అది వేరే విషయం.
చంద్రబాబు నాయుడు 50 రోజుల పాలన గురించి ప్రజలేమనుకుంటున్నారు?అని చిన్న సర్వే చేస్తే చాలా మంది సంతృప్తి వ్యక్తం చేస్తూనే జగన్ అరాచక పాలనని కూడా గుర్తుచేసుకుంటుండటం విశేషం.
సిఎం చంద్రబాబు నాయుడుపై ప్రజలకు చాలా భారీ అంచనాలు ఉన్నప్పటికీ, జగన్ చేసిన తప్పులను సరిదిద్ది, రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి చాలా కృషి చేస్తున్నారని, కనుక ఇప్పటికిప్పుడు అద్భుతాలు ఆశించడం లేదనే ప్రభుత్వోద్యోగులు, సామాన్య ప్రజలు చెపుతున్నారు.
అమరావతి పనులు ప్రారంభిస్తుండటం, కొత్త ఇసుక విధానంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే చంద్రబాబు నాయుడు పాలనకి 100కి 70 మార్కులు వేసిన్నట్లే భావించవచ్చు.
ఇక ఇరుగుపొరుగు రాష్ట్రాలు చంద్రబాబు నాయుడు పాలనకు మంచి మార్కులే వేస్తున్నాయి. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో పోటీ పడాలంటే మరిన్ని గంటలు అదనంగా పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం తిప్పుతూ ఏపీకి కావల్సినవి, రావాల్సినవి అన్నీ సాధించుకుంటున్నారని ఆయనను అమితంగా ద్వేషించే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం నూటికి నూరు మార్కులు పడిన్నట్లే అనుకోవచ్చు.
సిఎం చంద్రబాబు నాయుడు పాలన, ప్రజలు, అభివృద్ధిపైనే దృష్టిపెట్టి పనిచేసుకుపోతున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాగే పనిచేయాలని ప్రజలు కోరుకుంటారు. జగన్ కూడా ఇలాగే పనిచేస్తారనుకున్నారు. కానీ చేయలేదు.
కానీ చంద్రబాబు నాయుడు పట్ల టిడిపి కార్యకర్తలు మాత్రం కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారి అసంతృప్తికి కారణం తమకు పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత లభించడం లేదనో మరేదో దక్కనందుకో కాదు… నేటికీ వైసీపి నేతలకి భయం నేర్పించలేదనే!
వైసీపి నేతలు ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెలరేగిపోతున్నా సిఎం చంద్రబాబు నాయుడు వారిని కట్టడి చేయకుండా, నిశబ్ధంగా పనిచేసుకుపోతూ ఇదివరకులాగే మళ్ళీ ఇప్పుడూ వైసీపిని ఉపేక్షిస్తున్నారని అసహనంతో ఉన్నారు.
జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి 5 ఏళ్ళ పాటు తమని ఎంతగా వేధించారో టిడిపి కార్యకర్తలు గుర్తుచేసుకుని, వైసీపి పట్ల సిఎం చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంత మెతక వైఖరితో వ్యవహరిస్తున్నారని అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనుక సిఎం చంద్రబాబు నాయుడు వారి ఈ డిమాండ్‌పై కూడా కాస్త దృష్టి పెడితే గానీ మార్కులు వేయరు.




