తెలంగాణ సిఎం కేసీఆర్ ఈరోజు నాగ్‌పూర్‌లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చాలా ఆలోచించదగ్గ విషయాలే మాట్లాడారు. “ఏ దేశమైనా అభివృద్ధి చెందేందుకు 2-3 దశాబ్ధాలు సమయం పడుతుంది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైనా ఇంకా దేశం ఎందుకు అభివృద్ధి చెందలేదు?
కృష్ణాగోదావరి నదులు మహారాష్ట్రలో నుంచే పారి దిగువనున్న తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవహిస్తాయి. వాటిపై మేము ప్రాజెక్టులు కట్టుకొని సాగునీరు, త్రాగునీరు సరఫరా చేసుకొని పంటలు పండించుకొంటుంటే, మహారాష్ట్రలో సాగుత్రాగు నీరు ఎందుకు కటకటలాడాల్సివస్తోంది.
మహారాష్ట్రలో పలు ప్రాంతాలలో వారానికి లేదా 10 రోజులకు త్రాగునీరు సరఫరా అవుతుందని విని నేను ఆశ్చర్యపోయాను. రాష్ట్రంలోనే నదులు పారుతుంటే ఎందుకీ మీకీ దుస్థితి?దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్న బిజెపి ఎందుకు రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు అందించడం లేదు?
దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి. ఢిల్లీ పక్క నుంచే గంగా, యమునా నదులు పారుతున్నా ప్రజలకు త్రాగునీరు ఉండదు. దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్, బిజెపిలు 75 ఏళ్లపాటు ఏం చేశాయి? ఎన్నికలలో గెలవడం తప్ప మరే లక్ష్యం లేకపోవడం వలననే నేటికీ దేశంలో ఇటువంటి దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలాగా మహారాష్ట్రని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. సాగునీరు అందిస్తే మన రైతులకు ఏడాదికి మూడు పంటలు పండించి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు కూడా ఎగుమతి చేయగల సమర్ధులే.
మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీకేంపని? మీ ఉపముఖ్యమంత్రి దేవేంద్రా ఫడ్నవీస్ నన్ను అడిగారు. నిజమే! మహారాష్ట్రను కూడా తెలంగాణలాగా అభివృద్ధి చేసి ఉంటే ఇక్కడకి మేము రాగలిగేవరమా వచ్చినా ప్రజలు మమ్మల్ని పట్టించుకొనేవారా?మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు తీర్చడంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో విఫలమైనందునే మేము రావలసి వచ్చింది. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, మహారాష్ట్రను ఏవిదంగా అభివృద్ధి చేసి చూపిస్తామో మీరే చూద్దురుగాని,” అని అన్నారు.
కేసీఆర్‌లో రాజకీయ నాయకుడిని పక్కన పెట్టి దార్శనికుడిని చూగడగలిగితే ఆయన చెప్పినవన్నీ అక్షరసత్యాలని, ఆయనకు మహారాష్ట్రను కూడా అభివృద్ధి చేసి చూపగల సామర్ధ్యం ఉందని అందరికీ తెలుసు. అయితే తెలంగాణలో వేరే రాజకీయపార్టీలు రాకూడదని ఆయన కోరుకొంటున్నప్పుడు, ఇతర రాష్ట్రాలలో ఆయనకీ అదే నియమం వర్తిస్తుంది కదా?కానీ వర్తించదంటారు!
కేవలం 9 ఏళ్ళలో తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపారు. కానీ ఆ ‘అభివృద్ధి వ్యయం’లోనే ఆయన, కుటుంబ సభ్యులు, మంత్రులు భారీగా సంపద పోగేసుకొన్నారని తెలంగాణలో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పలువురు బిఆర్ఎస్ నేతల ఇళ్ళు, కార్యాలయాలపై తరచూ ఐటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి?
తెలంగాణ అంతగా అభివృద్ధి చెందినా అక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఎందుకున్నాయి?ఏపీలో లేని రాజకీయ అవకాశం తెలంగాణలో ఉందని అవి గట్టిగా ఎందుకు నమ్ముతున్నాయి?అని ఆలోచిస్తే కేసీఆర్ ప్రభుత్వంలో కూడా లోపాలున్నాయని అర్దమవుతోంది. అయితే ముందే అనుకొన్నట్లు, రాజకీయాలను, అభివృద్ధిని వేరు చేసి చూస్తే మాత్రం మహారాష్ట్రకు కేసీఆర్ సరైనోడు అని చెప్పకతప్పదు.



