కాంగ్రెస్‌-బిఆర్ఎస్ టైట్ రోప్ వాక్… కింద పడేది ఎవరో?

BRS Congress

తెలంగాణ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటికీ దానికి 39 సీట్లు రావడం, కాంగ్రెస్‌ గెలిచినప్పటికీ దానికి కేవలం 64 సీట్లు మాత్రమే రావడం వలన ఆ రెండు పార్టీలు కూడా చాలా ప్రమాదంలో ఉన్నాయని భావించవచ్చు. ప్రభుత్వ ఏర్పాటుకి 59 సీట్లు అవసరమైతే కాంగ్రెస్‌ వద్ద మరో 5 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కనుక వారిలో ఒకరిద్దరు బయటకు జారుకున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అలారం మొగుతుంది.

ADVERTISEMENT

బహుశః అందుకే సిఎం రేవంత్‌ రెడ్డి వీలైనంత త్వరగా ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఛైర్మన్‌ పదవులు, వీలైతే మిగిలిన మంత్రి పదవులు అన్నీ భర్తీ చేయాలని తొందరపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల గంట మోగేలోగా ఈ పని పూర్తి చేయకపోతే, బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను లాగేసేందుకు కాసుకు కూర్చోంది.

ఈ విషయం సిఎం రేవంత్‌ రెడ్డికి తెలుసు. కనుకనే లండన్ పర్యటనలో బిఆర్ఎస్ మిత్రపక్షమైన మజ్లీస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ భేటీ అయ్యారనుకోవచ్చు. ఒకవేళ మజ్లీస్‌తో ‘డీల్ కుదిరితే’ ఒకేసారి ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుంది. అప్పుడు కాంగ్రెస్‌ నుంచి ఒకరిద్దరు జారుకున్నా పెద్ద ప్రమాదం ఉండదు.

కానీ మజ్లీస్‌ని కూడా పూర్తిగా నమ్ముకోవడానికి లేదు. కనుక రేవంత్‌ రెడ్డి కూడా బీజేపీ, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకే గాలం వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే కేసులు, కార్పొరేషన్ పదవులతో వల విసురుతూనే ఉన్నారు. ఆ వలలో కొందరైనా చిక్కుకోవడం ఖాయమే.

ఒకవేళ ఒక అరడజను మంది బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినా చాలు… ఇక బిఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు ఎవరూ ఆపలేరు. అప్పుడు బిఆర్ఎస్‌ పతనం ప్రారంభం అవుతుంది.

కనుక కాంగ్రెస్‌-బిఆర్ఎస్‌ పార్టీలకు పరస్పరం పెను ప్రమాదం పొంచి ఉందని స్పష్టమవుతోంది. ఈ రెండు పార్టీల ఈ పరిస్థితి ‘టైట్ రోప్ వాక్’ వంటిదే అని చెప్పక తప్పదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కిందపడిపోయే ప్రమాదం ఉంటుంది. రెండు పార్టీలు ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా మైండ్ గేమ్స్ మొదలుపెట్టాయి. అవి ముగిసేలోగా ఏది కింద పడిపోతుంది… ఏది ముందుకు సాగుతుంది? అనేది తేలిపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories