అధికారం కోసం బీజేపీ వేస్తున్న ఎత్తులకు కాంగ్రెస్ చిత్తవుతోంది. ఇప్పటికే గోవాలో అతి పెద్ద పార్టీగా నిలిచి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ కు మణిపూర్ లో కూడా షాక్ తగిలింది. కాంగ్రెస్ టికెట్ పై పోటీచేసి గెలిచిన శ్యామ్ కుమార్ సింగ్ గోడ దూకిన సంకేతాలు కనపడుతున్నాయి. తాజాగా బీజేపీ నేతలతో కలసి దర్శనమివ్వడం స్థానికంగా తీవ్ర చర్చకు తెరలేపింది.
మరోవైపు స్థానిక పార్టీలు, టీఎంసీ, ఎల్జేపీల మద్దతు కూడగట్టుకున్న బీజేపీ, గవర్నర్ ను కలసి మద్దతు దారుల జాబితాను అందించింది. మొత్తం 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 31 కాగా, కాంగ్రెస్ 28 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ 21, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 1, నాగా పీపుల్స్ ఫ్రంట్ 4, నేషనల్ పీపుల్స్ పార్టీ 4, లోక్ జనశక్తి పార్టీ ఒక్క సీటులో విజయం సాధించగా, ఇండిపెండెంట్ అభ్యర్థి ఓ స్థానంలో గెలిచారు.
స్థానిక పార్టీలతో పాటు జంప్ జిలానీలపై ఆశలు పెట్టుకున్న బీజేపీ, మ్యాజిక్ ఫిగర్ ను సాధించినట్టే కనిపిస్తోంది. ఇదిలా వుండగా, అధిక సీట్లు సాధించిన తమకే ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ గవర్నర్ ను కోరింది. దీంతో మణిపూర్ లో ఎవరు ప్రభుత్వాన్ని నెలకొల్పుతారు? అన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్రంలో బిజెపి ఉంది కాబట్టి, అంతిమంగా ఆ అవకాశం బిజెపికే దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.



