ఈ వారం మొదట్లో తెలంగాణలోని పెద్దపల్లి టౌన్‌లో జరిగిన ఒక విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెనుగువాడకు చెందిన ఓ వ్యక్తి కరోనా కారణంగా మరణించాడు. దీంతో మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లాల్సి వచ్చింది. మున్సిపాలిటీ ట్రాకర్ట్ హాస్పిటల్‌కు వచ్చినా.. డెడ్ బాడీని తీసుకెళ్లడానికి ట్రాక్టర్ డ్రైవర్ అంగీకరించలేదు.
చాలా సేపటి వరకూ ఎవరూ ముుందుకు రాకపోవడంతో కరోనా వైరస్ డిస్ట్రిక్ట్ సర్వీలెన్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్న డాక్టర్ శ్రీ రామ్ ముందుకొచ్చారు. పీపీఈ కిట్‌లో ఉన్న ఆయన.. ట్రాక్టర్ నడిపి శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లారు. సదరు డాక్టర్ చూపించిన మానవతా దృక్పథానికి… తెగువకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి.
జాతీయ మీడియా కూడా ఎంతగానో పొగిడింది. అయితే ట్రాక్టర్ నడిపిన డాక్టర్ కు తెలంగాణ సర్కార్ షోకాజ్ నోటీసు జారీచేసింది. శవాన్ని శ్మశానానికి తరలించడంలో ఐసీఎంఆర్ గైడ్లైన్స్ పాటించలేదని, అదే సమయంలో డాక్టర్ అయ్యుండి శవాన్ని ఎందుకు తరలించారో చెప్పాలి అంటూ జిల్లా అధికారులు ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
అయితే ఇందులో మానవత్వంతోనే వ్యవహరించాను తప్ప తనకు ఎటువంటి దురుద్దేశాలు లేవని డాక్టరు సంజాయిషీ ఇచ్చుకున్నారట. అయితే దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. “తెలంగాణలో హీరో అయితే ముఖ్యమంత్రి లేదా ఆయన కొడుకు అవ్వాలి… ఇంకొకళ్ళు అవ్వాలని చూస్తే ఇలానే షోకాజ్ నోటీసులు వస్తాయి,” అంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.





