రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికి దశాబ్ద కాలం గడిచిపోయింది. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మీద అధికార – విపక్షాల మధ్య రాజకీయం నడుస్తూనే వస్తుంది. టీడీపీ మొదటి నుంచి అమరావతే రాష్ట్ర రాజధాని అంటూ ప్రకటించింది, అమరావతి అభివృద్ధికే కట్టుబడి ముందుకెళ్తుంది.
ఇక వైసీపీ రాష్ట్ర రాజధానిగా అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు పలికి తిరిగి అదే అసెంబ్లీ లో అమరావతి కి వ్యతిరేకంగా మూడు రాజధానులు అంటూ ప్రకటన చేసి చివరికి ఆ ప్రకటనకు కూడా కట్టబడకుండా విశాఖ రాజధాని అంటూ కొన్నాళ్ళు కాలక్షేపం చేసింది.
అయితే జగన్ రాజధాని పట్ల అనుసరిస్తున్న ఈ చెంచేల దృక్పథమే వైసీపీ ని 151 నుంచి 11 కి తెచ్చింది. అయినా జగన్ ఇప్పటికి రాజధాని పట్ల తన ప్రభుత్వంలో జరిగిన తప్పులను, తన పాలనలో చేసిన పొరపాట్లను గ్రహించకుండా ఇప్పుడు రాజధానిగా మావిగన్ అంటూ ఆంధ్రప్రదేశ్ డిక్షనరీ లో లేని కొత్త ప్రాంతాన్ని పట్టుకొచ్చారు.
2029 వైసీపీ ఎన్నికల నినాదం మావిగన్ అంటూ ప్రకటించిన జగన్ వైసీపీ మానిఫెస్టో లో కూడా మావిగన్ ప్రస్తావన ఉంటుందంటూ కుండబడ్దలు కొట్టారు. అమరావతి కోరుకునే ప్రజలు కూటమికి ఓటేస్తారని, మావిగన్ కు మద్దతు తెలిపే వారు వైసీపీ వెంట నడుస్తారంటూ వైసీపీ రాజకీయ భవిష్యత్ ని మావిగన్ తో ముడిపెట్టారు.
అయితే రాష్ట్ర విభజన నాటి నుంచి టీడీపీ, జనసేన రెండు పార్టీలు కూడా రాజధానిగా అమరావతి కే ఓటేశాయి. పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షానికి పరిమితమైన ఈ ఇద్దరు నేతలు ఈ రెండు పార్టీలు అమరావతి కి అండగా నిలిచారు. తన 40 ఏళ్ళ రాజకీయ అనుభవం మొత్తం కూడా అమరావతి నిర్మాణానికి పెట్టుబడిగా పెట్టేందుకు బాబు ముందుకొచ్చారు.
అలాగే ఏడూ కోట్ల ఆంధ్రుల భవిష్యత్ కోసం, రానున్న తరాల భవితవ్యం కోసం తన రాజకీయ భవిష్యత్ ని పణంగా పెట్టేందుకు పవన్ ఎన్నడూ వెనకడుగు వేయలేదు. ఈ ఇద్దరి బలమైన సంకల్ప బలమే ఐదేళ్ల వైసీపీ అరణ్యవాసాన్ని తట్టుకుని, వైసీపీ శ్రేణుల నీలాపనిందలు భరిస్తూ తిరిగి అమరావతి రాజధానిగా పట్టాభిషేకం చేసుకుని అభివృద్ధి వైపు అడుగులేస్తోంది.
SRM, VIIT, AMRUTA, BITS వంటి అనేక విశ్వవిద్యాలయాలు అమరావతిలో కొలువుతీరాయి. ఇక అధునాతన టెక్నాలజీ గా భావించే క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ సైతం అమరావతి కి తరలి వచ్చింది. ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా ఎదుగుతున్న అమరావతి నేటితరం యువత ఉపాధికి రానున్న తరం భవిష్యత్ మార్గంగా మారనుంది.
మరి వైసీపీ భవిష్యత్ గా భావించే మావిగన్ తో జగన్ రాష్ట్రానికి చేసేదేంటి.? అమరావతి నిర్మాణాల కోసం ఇప్పటికే కూటమి ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టింది. రేపటి రోజున జగన్ అధికారంలోకి వస్తే ఆ వేలకోట్లను తన అహం చల్లార్చుకోవడానికి, తన పార్టీ పంతం నెరవేర్చడానికి నీటిపాలు చేస్తారా.?
ప్రభుత్వాలు ఖర్చు పెట్టె ప్రతి రూపాయి ప్రజల కష్టార్జితమే. అటువంటి కష్టార్జితాన్ని తన పంతం నిలుపుకోవడానికి వెచ్చిస్తాననడమేనా జగన్ చేసే అభివృద్ధి.? వైసీపీ చెపుతున్న అవినీతి నిర్ములన.? కూల్చివేతలు తప్ప నిర్మాణాలు చేతకాని వారు ఇలా ఎన్నికకొక రాజధాని పేరు చెప్పుకుంటూ ఏపీ భవిష్యత్ ని గాల్లో దీపం లా ఉంచాలనుకుంటున్నారా.?
ఒక ప్రభుత్వాన్ని నమ్మి కొన్ని వందల కుటుంబాలు కొన్ని వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం ఇస్తే జగన్ తన మావిగన్ తో ఆ కుటుంబాల వర్తమానాన్ని, వారి పిల్లల భవిష్యత్ ని మచిలీపట్టణం పోర్ట్ లో, విజయవాడ విమానాశ్రయం లో, గుంటూరు హై వే మీద ఉంచాలనుకుంటున్నారా.?






