ఒక కరుడుగట్టిన నేరస్తుడినో… ఉగ్రవాదినో మాటు వేసి పట్టుకొన్నట్లుగా ఏపీ సీఐడీ పోలీసులు నిన్న అర్దరాత్రి నర్సీపట్నంలో టిడిపి సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి ఇంటిని చుట్టుముట్టి గోడ దూకి ఇంట్లో జొరబడి అరెస్ట్ చేశారు. ఇదివరకు పలువురు టిడిపి నేతలతో ఇదే విదంగా వ్యవహరించినప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించవద్దంటూ హైకోర్టు వారికి గట్టిగా మొట్టికాయలు వేసింది. కానీ వారికి ఇటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నవారు కోర్టులో జవాబు చెప్పుకోవలసిన అవసరం ఉండదు కనుక వారికీ, కోర్టులకు మద్య పోలీసులు నలిగిపోతున్నారు.
అయ్యన్న పాత్రుడి విషయంలో మళ్ళీ అదే జరిగింది. అర్దరాత్రి అరెస్ట్ చేసి విశాఖకు తరలించి రిమాండ్ విధించాలని విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టును కోరగా, రిమాండ్ విధించడానికి బలమైన కారణం లేదంటూ తిరస్కరించింది. ముందుగా అయ్యన్నకు 41ఏ కింద నోటీస్ ఎందుకు ఇవ్వలేదనే న్యాయమూర్తి ప్రశ్నకు పోలీసులవద్ద సమాధానం లేదు.
ఈ వ్యవహారంపై అయ్యన్న తరపు న్యాయవాదులు వెంటనే హైకోర్టుని ఆశ్రయించారు. అయ్యన్న కేసు డెయిరీని రేపు ఉదయం 10.30 గంటలకల్లా సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అయ్యన్న పాత్రుడుపై ప్రభుత్వం కక్ష కట్టి ఏదోవిదంగా జైలులో పెట్టాలనే ఆలోచనతోనే అర్దరాత్రి అరెస్ట్ చేసిందని, కనుక అయ్యన్నకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన న్యాయవాదులు హైకోర్టుని కోరారు. రేపు కేసు డెయిరీ పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకొంటామని హైకోర్టు హామీ ఇచ్చింది.
అయ్యన్న పాత్రుడు, ఆయన ఇద్దరు కుమారులు తమకు చెందని రెండు సెంట్ల స్థలం కలిపేసుకొనేందుకు ‘నో అబ్జక్షన్ సర్టిఫికేట్’ మీద ప్రభుత్వాధికారి పేరుతో సంతకం చేసి ఫోర్జరీ నేరానికి పాల్పడ్డారని ఏపీ సీఐడీ పోలీసుల ఆరోపిస్తూ ఆయనపై ఐపీసీ 464, 467, 471, 474, రెడ్ విత్ 120-B, 34 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.
అయితే అయ్యన్న పాత్రుడు స్థాయి వ్యక్తి కేవలం రెండు సెంట్ల స్థలం కోసం ఇటువంటి నేరానికి పాల్పడతారనుకోవడం అవివేకమే. ఒకవేళ ఆయన నిజంగానే ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తే, న్యాయస్థానం సూచించినట్లు రూల్స్ ప్రకారం ముందుగా వారికి సెక్షన్ 41ఏ కింద నోటీస్ ఇచ్చి, పగటిపూట వెళ్ళి వారిని అరెస్ట్ చేయవచ్చు. కానీ ఆయన ఏదో ఓ కరుడుగట్టిన నేరస్తుడో లేదా ఉగ్రవాదో అన్నట్లు అర్దరాత్రి ఆయన ఇంటిని చుట్టుముట్టి గోడ దూకి ఇంట్లో జొరబడి అరెస్ట్ చేశారు.
అయ్యన్నను అరెస్టు చేసిన విధానాన్ని ఒక్క టిడిపి శ్రేణులే కాదు… రాష్ట్రంలో అన్ని పార్టీలు, చివరికి సామాన్య ప్రజలు కూడా తప్పు పడుతున్నారు. రాజకీయాలను ఈవిదంగా దిగజార్చుకొంటూ పోతే చివరికి ఏమవుతుందో తెలుసుకోవాలనుకొంటే ఓసారి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధిలు ఆనాడు చేసుకొన్న పరస్పర అవమానాలను ఓసారి గుర్తు చేసుకొంటే మంచిది. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది అదే… రేపు మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తే అప్పుడు మన పరిస్థితి ఏమిటి? అని వైసీపీ నేతలు, పోలీసులు కూడా ఆలోచించుకొంటున్నారో లేదో?




