మోడీకి దగ్గరైతే భస్మం అయిపోతారు జాగ్రత్త!

CPI Narayanaరాష్ట్ర రాజకీయాలలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణది విలక్షణ శైలి అని చెప్పవచ్చు. ఏపీలో ఏ పార్టీతోను సీపీఐకి పొత్తులు లేకపోవడం వలన ఆయన నోటికి అన్ని పార్టీలు సమానంగా బలైపోతుంటాయి. టిడిపి, జనసేన, బిజెపిల పొత్తుల గురించి మాట్లాడుతూ, “ఆ మూడు రాజకీయ పార్టీలు. ఏ పార్టీకి నచ్చినదానితో అది పొత్తులు పెట్టుకోవచ్చు. దానికి ఎవరి పర్మిషన్ అక్కరలేదు. ఎవరో ఏడుస్తున్నారని లేదా ఎవరూ సంతోషిస్తారని చూడక్కరలేదు,” అని అన్నారు.

బిజెపితో దోస్తీ గురించి మాట్లాడుతూ, “టిడిపి, జనసేనలు రెండూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, మోడీకి దగ్గరగా వెళ్ళినవారు భస్మం అయిపోతారు. దీపాన్ని చూసి ముచ్చటపడి ముద్దు పెట్టుకొంటే మూతి కాలుతుంది. అలాగే మోడీ చంకనెక్కాలని ఉబలాటపాడేవారు ఆయన దృతరాష్ట్ర కౌగిలిలో నలిగిపోతారు. కనుక టిడిపి, జనసేనలు ఆయనకి, బిజెపికి ఎంత దూరంగా ఉంటే అంతా వాటికే మంచిది.

ADVERTISEMENT

అసలు ఏపీకి ఎవరైనా శత్రువు ఉంటే అది ప్రధాని నరేంద్రమోడీ, బిజెపిలే. ఏపీకి ఇస్తామన్న ప్రత్యేకహోదా ఇవ్వలేదు. కడప ఉక్కు కర్మాగారం కట్టించలేదు. జాతీయ ప్రాజెక్టుగా ప్రతించిన పోలవరానికి నిధులు ఇవ్వకుండా నిలిపివేశారు. ఏపీకి ఏమీ ఇవ్వకపోగా వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ని కూడా అమ్మేస్తున్నారు. కనుక ఏపీకి మోడీయే ప్రధానశత్రువు. అటువంటి వారికి టిడిపి, జనసేనలు దూరంగా ఉంటే మంచిది లేకుంటే చివరికి వారే నష్టపోతారు,” అని నారాయణ హితవు పలికారు.

ఈ విషయం చంద్రబాబు నాయుడుకి, పవన్‌ కళ్యాణ్‌కి తెలియదనుకోలేము. కానీ రాష్ట్రంలో అత్యంత శక్తివంతంగా మారిన వైసీపీని గద్దె దించాలంటే తమకు మోడీ సహకారం కూడా అవసరమని భావిస్తున్నట్లున్నారు. బహుశః అందుకే మోడీ దీపం అని తెలిసి ఉన్నా ముద్దు పెట్టుకొనేందుకు ఇద్దరూ తహతహలాడుతున్నారనుకోవచ్చు.

అయితే గమ్మతైన విషయం ఏమిటంటే నేటికీ బిజెపితో పొత్తులో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ దానితో కొనసాగడమా వద్దా అని ఊగిసలాడుతుంటే, “టిడిపితో మాకు పొత్తులు వద్దేవద్దు…” అని ఖరాఖండీగా బిజెపి చెపుతున్నప్పటికీ దానితో దోస్తీ కుదిరితే బాగుండునని చంద్రబాబు నాయుడు ఆశగా ఎదురుచూస్తుండటం విశేషం.

చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ తమ పార్టీల బలం ఇంకా గుర్తించక బిజెపితో దోస్తీ కోసం ఆశపడుతున్నారేమో కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు వాటి శక్తి సామర్ధ్యాలను బాగానే గుర్తించారు. టిడిపి, జనసేనలు చేతులు కలిపితే వచ్చే ఎన్నికలలో వైసీపీకి ఓటమి తప్పదని గట్టిగానే నమ్ముతున్నారు. అందుకే ఎట్టి పరిస్థితులలో ఆ రెండు పార్టీలు కలవకుండా వాటిని దూరంగా ఉంచేందుకు వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

కనుక టిడిపి, జనసేనలు ఏపీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బిజెపితో దోస్తీ కోసం అర్రులు చాపడం మానేసి రెండూ చేతులు కలిపి పోరాడితే మంచిదేమో కదా? “ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే ప్రసక్తే లేదు… వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ని అమ్మి పాడేస్తామని” నిర్మొహమాటంగా చెపుతున్న బిజెపితో అంటకాగితే తమ బంధాన్ని రాష్ట్ర ప్రజలు ఆమోదిస్తారా? ఆలోచించుకొంటే మంచిదేమో? నారాయణ మాటలు కాస్త కటువుగా ఉన్నప్పటికీ వాస్తవమే కదా?

ADVERTISEMENT
Latest Stories